మార్గదర్శి కేసులో సుప్రీం తీర్పుపై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు
రామోజీరావు పాల్పడ్డ ఆర్థిక అక్రమాల వ్యవహారంలో నిజాలు బయటకు రావాలన్నదే తనకు కావాల్సిందని ఉండవల్లి చెప్పారు. ఇదే విషయాన్ని అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రాకు కూడా చెప్పానన్నారు.
మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ హైకోర్టుకు విచారణ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. మార్గదర్శిలో జరిగింది ఆర్థిక నేరమని ఆయన చెప్పారు. రామోజీరావు ఎవరైతే నాకేంటి.. ఒక ఇష్యూలో తప్పు జరిగింది.. ఒక వ్యక్తి తప్పు చేస్తే మనం కళ్లు మూసుకుపోవాలా? అందుకే ఈ విషయాన్ని బయటకు తీశాను.. అని ఆయన సూటిగా చెప్పారు. తాను అడిగింది 45–ఎస్ ఉల్లంఘన గురించని, అది తేల్చితే చాలని ఉండవల్లి తెలిపారు. రాజమండ్రిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
వక్రీకరణ ఈనాడుకు అలవాటుగా మారింది..
రామోజీరావు పాల్పడ్డ ఆర్థిక అక్రమాల వ్యవహారంలో నిజాలు బయటకు రావాలన్నదే తనకు కావాల్సిందని ఉండవల్లి చెప్పారు. ఇదే విషయాన్ని అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రాకు కూడా చెప్పానన్నారు. ఈనాడు రాసిన రాతలపైనే ఒకరోజు ఎగ్జిబిషన్ పెడతానని ఆయన తెలిపారు. వక్రీకరించి వార్తలు రాయడం ఈనాడుకు అలవాటుగా మారిందన్నారు. భావవ్యక్తీకరణను ఏ రకంగా చంపేస్తారో.. ఈనాడు అలాంటి రాతలను ఇన్ని సంవత్సరాల్లో అనేకంగా రాసిందని ఆయన తెలిపారు. తన మాటలను వక్రీకరించి చూపారని ఉండవల్లి అన్నారు.
జడ్జిల వల్లే న్యాయం జరిగింది..
మార్గదర్శి కేసులో విచారణను 6 నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని ఉండవల్లి అన్నారు. ఎంతమంది ఖాతాదారులకు డబ్బులు వెనక్కిచ్చారన్న విషయాన్ని పరిశీలించడానికి ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని జ్యుడీషియల్ అధికారిగా ఏర్పాటు చేశారని చెప్పారు. 80 నిమిషాల పాటు ఇండియాలో ఉన్న టాప్ అడ్వకేట్స్ ముగ్గురు రామోజీరావు తరపున దీనిపై వాదనలు వినిపించారన్నారు. ఈ కేసులో న్యాయం జరిగిందంటే కేవలం జడ్జిల వల్లే జరిగిందని భావించాలని తెలిపారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అందజేసిన మెచ్యూరిటీ అమౌంట్‌కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఖాతాదారుల దగ్గర ఉన్న ఆధారాలు, పూర్తి అడ్రస్‌తో జీమెయిల్‌కి పంపాలని ఉండవల్లి సూచించారు. ఇందుకోసం.. ద డిపాజిటర్స్ ఎట్ ద రేటాఫ్ జీమెయిల్ డాట్ కామ్ అనే జీమెయిల్ ఖాతా ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. ఈ వ్యవహారం ఆరు నెలల్లో తేల్చమని సుప్రీంకోర్టు చెప్పిందని, ఏదో ఒక లాజికల్ కంక్లూజన్ వస్తుందని భావిస్తున్నానని ఉండవల్లి తెలిపారు.