'కమ్మ'లు లేని కేబినెట్.. జగన్ పై ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
ఉండవల్లి ప్రెస్ మీట్ అంటే కొన్నిసార్లు వైసీపీకి మద్దతుగా ఉంటుంది, ఇంకొన్నిసార్లు జగన్ తప్పుల్ని ఎత్తి చూపుతున్నట్టుగా ఉంటుంది. ఈసారి కూడా జగన్ ప్రభుత్వంపై, కేబినెట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉండవల్లి.
ఏపీ రాజకీయాల్లో ఏ కులం ప్రాధాన్యత ఎక్కువగా ఉంది, పేరుకి జనాభా ఉన్నా ఎవరికి ప్రాధాన్యత లేదు.. అనే విషయాలను పరోక్షంగా గుర్తు చేసే పుస్తకం 'ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, శాసన సభలో ఎవరెవరు?'. మండలి బుద్ధ ప్రసాద్ రాసిన ఈ పుస్తక సమీక్ష కార్యక్రమం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కమ్మవారు లేని కేబినెట్..
ఉండవల్లి ప్రెస్ మీట్ అంటే కొన్నిసార్లు వైసీపీకి మద్దతుగా ఉంటుంది, ఇంకొన్నిసార్లు జగన్ తప్పుల్ని ఎత్తి చూపుతున్నట్టుగా ఉంటుంది. ఈసారి కూడా జగన్ ప్రభుత్వంపై, కేబినెట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉండవల్లి. ఏపీ ఆవిర్భావం తర్వాత కమ్మవారు లేని ఏకైక కేబినెట్ ఇదేనని చెప్పారు. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు ఎప్పుడూ ఏపీ రాజకీయాలపై ఆధిపత్యం చలాయించేవని, కానీ, తొలిసారి వాటిలో ఓ సామాజిక వర్గానికి కేబినెట్ లో ఎంట్రీ లేకపోవడం విశేషం అన్నారు.
అన్ నోన్ ఏంజెల్..
'నోన్ డెవిల్స్ ఈజ్ బెటర్ దేన్ అన్ నోన్ ఏంజెల్' అంటూ పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించకుండానే ఆయనకు మద్దతుగా మాట్లాడారు ఉండవల్లి. ఇప్పటికే ఏపీలో వారిద్దరి పాలన ప్రజలు చూశారని, మళ్లీ వారిద్దరిలోనే ఒకరిని ఎన్నుకోవాల్సిన సందర్భం ఉందని గుర్తుచేశారు. ప్రజలెవరూ మాకెందుకులే అని స్పందించకుండా ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితులున్నాయని చెప్పారు ఉండవల్లి.
చిరంజీవి తప్పు చేశారా..?
ప్రజారాజ్యం పార్టీకి 16 శాతం ఓట్లు రావడం గొప్ప విషయం అని, అయితే చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి పొరపాటు చేశారని, తాను వారించినా అప్పటికే ఆ తప్పు జరిగిపోయిందని గుర్తుచేశారు ఉండవల్లి అరుణ్ కుమార్. కులం చూసి ప్రజలు ఓట్లు వేయరని, సమస్యల గురించి పోరాటం చేస్తే, ప్రజలు ఆ నాయకుడిని నమ్మితే.. అప్పుడు కులం ఓట్లుకూడా పడతాయని చెప్పారు.
లక్ష్మీపార్వతి గురించి..
ఎన్టీఆర్ రూ.100 నాణెం విడుదల గురించి కూడా స్పందించారు ఉండవల్లి. నాణెం విడుదల మంచిదే కానీ, ఆ కార్యక్రమానికి లక్ష్మీపార్వతిని పిలవకపోవడం కరెక్ట్ కాదన్నారు. చివరి రోజుల్లో ఎన్టీఆర్ ని చూసుకుంది లక్ష్మీపార్వతేనని, ఆమె వల్లే తాను బ్రతకగలిగానని స్వయంగా ఎన్టీఆరే చెప్పారని గుర్తుచేశారు.
*