నెల్లూరులో పావులు కదుపుతున్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. ప్రత్యర్థులతో భేటీ
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి జిల్లాలో పావులు కదుపుతూ తన రాజకీయ ప్రత్యర్థులతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. దాంతో జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
నెల్లూరులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి జిల్లాలో పావులు కదుపుతూ తన రాజకీయ ప్రత్యర్థులతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డితో సమావేశమైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బొల్లినేని వెంకట రామారావుని కూడా కలిశారు. దాంతో జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇటీవల నెల్లూరు మాజీ జెడ్పీ ఛైర్మన్, టీడీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కి పాల్పడ్డారనే ఆరోపణలతో వైసీపీ నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో శ్రీదేవి మినహా మిగిలిన ముగ్గురూ నెల్లూరుకి చెందిన ఎమ్మెల్యేలు. దాంతో 2024 ఎన్నికల్లో వైసీపీకి నెల్లూరులో కాస్త ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థులైన టీడీపీ సీనియర్ నేతలతో భేటీ అవుతూ ఉదయగిరిలో భారీ బహిరంగ సభకి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలోని కలిగిరిలో ఉన్న బొల్లినేని వెంకట రామారావు క్యాంప్ ఆఫీస్‌కి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వెళ్లగా.. ఎదురేగి మరీ ఆయన స్వాగతం పలికారు. ఇద్దరి భేటీ అనంతరం మీడియాతో మేకపాటి మాట్లాడుతూ ఉదయగిరి అభివృద్ధి కోసమే తాము కలిశామని చెప్పుకొచ్చారు. అలానే బొల్లినేని, కంభం, విజయరామిరెడ్డి, చెంచల బాబు యాదవ్‌లతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొంత మంది టీడీపీ కార్యకర్తలతోనూ మేకపాటి మాట్లాడుతూ.. ఇన్నాళ్లు ఏవైనా ఇబ్బందులు పెట్టి ఉంటే క్షమించాలని కోరారు.