టీడీపీ కోవర్టులే నన్ను విమర్శిస్తున్నారు.. - హరిరామజోగయ్య మరో రెండు లేఖలు
పవన్ ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలో ఎంపిక చేసుకోవలసిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా జోగయ్య ప్రస్తావించారు. పవన్ భీమవరం నుంచి పోటీచేస్తారని భావించినప్పటికీ ఆయన పిఠాపురంపై ఆసక్తి చూపుతున్నారని తెలిసిందని పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ ఎదుగుదలకు తాను చేస్తున్న ప్రయత్నాన్ని కొందరు జనసైనికులు, అధికార ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారని.. మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన విడుదల చేసిన లేఖలో ఈ అంశంపై స్పందించారు. పవన్ కళ్యాణ్ అధికారాన్ని చేపట్టవలసిన అవసరాన్ని కూడా గ్రహించలేని.. చంద్రబాబు, లోకేష్‌ల భవిష్యత్‌ను మాత్రమే కోరుకునే కొందరు తనను, తన చర్యలను వివిధ మాధ్యమాల ద్వారా విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కన్నా చంద్రబాబు భవిష్యత్‌నే కోరుకునే ఇలాంటి వారిని జనసేన గొడుగులో ఉన్న టీడీపీ కోవర్టులనే అంటానని స్పష్టం చేశారు.
భీమవరంలో పోటీ చేస్తే...
పవన్ ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలో ఎంపిక చేసుకోవలసిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా జోగయ్య ప్రస్తావించారు. పవన్ భీమవరం నుంచి పోటీచేస్తారని భావించినప్పటికీ ఆయన పిఠాపురంపై ఆసక్తి చూపుతున్నారని తెలిసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లో అనుకూల, ప్రతికూల అంశాలపై తన అభిప్రాయాలను ఈ లేఖలో ప్రస్తావించారు. భీమవరంలో జనసేన, టీడీపీ కలిసి ప్రయాణం చేయడం, టీడీపీ అధినేతల నుంచి ఎటువంటి వ్యతిరేకతా లేకుండా సానుకూలతగా ఉండటం అనుకూలతలని పేర్కొన్నారు. ఇక వ్యతిరేక అంశాలను పరిశీలిస్తే.. వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్, బీసీలు ఇప్పుడు వైసీపీకి అండగా ఉండటం, ఎస్సీ ఓటర్లలో 98 శాతం మంది వైసీపీ వైపు ఉండటం, బీజేపీని కలుపుకొనే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మైనారిటీ, క్రిస్టియన్ ఓట్లు దూరమవడం, సంక్షేమం, అభివృద్ధి రూపంలో వైసీపీ గతం కంటే ఎక్కువగా బలపడటం ఇబ్బందికర అంశాలని వివరించారు. అంతేగాక.. గత టీడీపీ పాలనలో ఉన్న అవినీతి పార్టనర్‌గా ఉన్న జనసేనకు అంటుకోవడం, పవన్ పవర్ చేపట్టలేకపోతున్నాడని జనసైనికుల్లో ఉన్న నిరాశ, కాపులకు వ్యతిరేకి అయిన చంద్రబాబుకు అధికారం అందించడానికి పవన్ కారణమౌతుండటం వంటివి కూడా ప్రధానంగా ప్రభావం చూపే వ్యతిరేక అంశాలని తెలిపారు.
పిఠాపురంపై ఇలా..
పిఠాపురంలో కాపుల శాతం, పవన్ అభిమానులు అధికంగా ఉండటం అనుకూల అంశాలని జోగయ్య పేర్కొన్నారు. వ్యతిరేక అంశాలను పరిశీలిస్తే.. ఎక్కువే ఉన్నాయని, కాపుల్లో గ్రూపులు ఎక్కువగా ఉండటం ప్రధాన ఇబ్బందని పేర్కొన్నారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతకు ఎంపీగా మంచి పేరు ఉండటం, స్థానికురాలు కావడం, మహిళా అభ్యర్థిని కావడం వ్యతిరేక అంశాలేనని తెలిపారు. ఇక చంద్రశేఖరరెడ్డితో ఉన్న ఇబ్బంది.. ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురంలో పోటీ చేసే అవకాశం ఉండటం, పవన్‌ను ఓడించాలనే గట్టి సంకల్పంతో సీఎం జగన్ ఉండటం, టీడీపీ ఇన్‌చార్జి వర్మ పవన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడం, చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, 95 శాతం ఎస్సీ ఓటర్లు వైసీపీకి మద్దతు పలకడం, బీజేపీతో జతకట్టడం వల్ల ముస్లిం, క్రిస్టియన్ ఓటర్లు వ్యతిరేకతగా ఉండటం నష్టం కలిగించే అంశాలుగా కనిపిస్తున్నాయని జోగయ్య వివరించారు.