Telugu Global
Andhra Pradesh

విషాదం మిగిల్చిన విహారం.. - సముద్రంలో మునిగి ఇద్దరు మృతి.. మరొకరు గల్లంతు

తణుకు నుంచి మొత్తం 10 మంది ఆదివారం ఉదయం 10 గంటలకే సముద్రానికి చేరుకోగా.. ఉదయం నుంచీ వీరు సముద్రంలో సరదాగా గడిపారు.

విషాదం మిగిల్చిన విహారం.. - సముద్రంలో మునిగి ఇద్దరు మృతి.. మరొకరు గల్లంతు
X

దసరా సెలవులను ఆనందంగా గడపాలనుకున్న కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణం నుంచి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది సముద్ర స్నానం కోసం మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌కి వెళ్లగా.. అక్కడ ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగి ముగ్గురు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా, మరో వ్యక్తి ఆచూకీ లభించలేదు. మృతిచెందినవారిలో గొరసా సావిత్రి (35), ఆమె సోద‌రుడి కుమారుడు అనుపోజు రఘువర్మ (26) ఉండగా, రఘువర్మ చిన్నాన్న కొడుకు అనుపోజు రవికుమార్‌ (17) సముద్రంలో గల్లంతయ్యాడు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన పండుగ వేళ ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.

తణుకు నుంచి మొత్తం 10 మంది ఆదివారం ఉదయం 10 గంటలకే సముద్రానికి చేరుకోగా.. ఉదయం నుంచీ వీరు సముద్రంలో సరదాగా గడిపారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మరోసారి సముద్రంలోకి దిగారు. వారితో పాటు సావిత్రి కుమార్తెలు శ్రావణి (16), తన్మయి (15) కూడా సముద్రంలోకి దిగారు. వీరంతా జలకాలాటల్లో నిమగ్నమై ఉండగా ఒక పెద్ద అల రావడంతో అదుపుతప్పి సముద్రంలోకి కొట్టుకుపోయారు. వెంటనే ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, మత్స్య కారులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ముందుగా శ్రావణి, తన్మయిలను బయటికి తీసుకొచ్చారు. రెండో ప్రయత్నంలో రఘువర్మ, సావిత్రిలను కూడా తీసుకొచ్చారు.

అయితే సావిత్రి ఒడ్డుకు చేరేటప్పటికే ప్రాణాలు కోల్పోయింది. కొన ఊపిరితో ఉన్న రఘువర్మను నరసాపురం ప్రభుత్వాస్ప‌త్రికి తీసుకెళ్లగా.. అక్కడ ప్రాణాలు కోల్పోయాడు. రవికుమార్‌ ఆచూకీ లభించలేదు. సోమవారం కూడా రవికుమార్‌ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం నుంచి బయటపడిన తన్మయి, శ్రావణి భీమవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయదశమి పండుగ సెలవుల్లో భాగంగా బంధువులంతా ఒకేచోట కలిశామనే ఆనందంలో విహారయాత్రకు వెళితే.. తమ ఇంట తీరని విషాదం మిగిలిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సరిగ్గా 24 గంటల ముందు..

సరిగ్గా ఈ ఘటనకు జరగడానికి 24 గంటల ముందు అంటే శనివారం నాడు తణుకు నుంచే విహార యాత్రకు వెళ్లిన ఏడుగురు యువకుల్లో నలుగురు తాళ్లపూడి వద్ద గోదావరిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరు కూడా దసరా సెలవులను ఆనందంగా గడపాలని యానాంకు విహార యాత్రకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. 24 గంటల వ్యవధిలో తణుకుకు చెందిన ఆరుగురు విహార యాత్రకు వెళ్లి మృత్యువాత పడగా, మరొకరు గల్లంతవడం.. తణుకు పట్టణాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. మృతుల కుటుంబాలను దుఃఖ సాగరంలో ముంచేసింది.

First Published:  23 Oct 2023 12:14 PM IST
Next Story