తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రంలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు
బ్రహ్మోత్సవాల సమయంలో ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలు మాత్రమే ఉంటాయని, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్న నేపథ్యంలో ఎటువంటి సిఫార్సు లేఖలూ స్వీకరించబడవని ఈ సందర్భంగా ఈవో స్పష్టం చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అన్నమయ్య భవన్‌లో అన్నివిభాగాల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించిన ఈవో ధర్మారెడ్డి.. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం అధికారిక ప్రకటన చేశారు. ఈ ఏడాది అధిక మాసం కారణంగా.. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రెండు బ్రహ్మోత్సవాలకు తిరుమల పుణ్యక్షేత్రాన్ని సిద్ధం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఉంటాయని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.
వచ్చే నెల 18న స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ..
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 18న ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని ఈవో తెలిపారు. అదే రోజు సాయంత్రం ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. సెప్టెంబర్ 22న గరుడ సేవ, 23న స్వర్ణ రథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, తిరుమలలో వైభవంగా ధ్వజావరోహణ కార్యక్రమంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయని వివరించారు.
సిఫార్సు లేఖలకు నో ఛాన్స్..
బ్రహ్మోత్సవాల సమయంలో ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలు మాత్రమే ఉంటాయని, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్న నేపథ్యంలో ఎటువంటి సిఫార్సు లేఖలూ స్వీకరించబడవని ఈ సందర్భంగా ఈవో స్పష్టం చేశారు. ఇక అధిక మాసం కారణంగా ఈ ఏడాది అక్టోబర్‌లో 14-18 తేదీల నడుమ నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని ఈవో తెలిపారు. అక్టోబర్ 18న గరుడవాహన సేవ, 20న పుష్పక విమానం, 22న స్వర్ణ రథం, 23న చక్రస్నానంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని వివరించారు. ఈ ఏడాది పెరటాసి మాసంలో రెండు బ్రహ్మోత్సవాలు ఉన్న క్రమంలో భారీ స్థాయిలో భక్తులు తిరుమల బ్రహ్మోత్సవాలకు విచ్చేసే అవకాశం ఉండొచ్చని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
పవిత్ర మాసం సెప్టెంబర్ 18న ప్రారంభమై అక్టోబరు 17న ముగుస్తుందని ఈవో తెలిపారు. అలాగే.. సెప్టెంబర్ 23, 30, అక్టోబర్ 7, 14 తేదీల్లో పురటాసి శనివారాలు జరుగుతాయని, కాబట్టి ఈ రెండు బ్రహ్మోత్సవాలు, పురటాసి శనివారాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా దర్శనం కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు టీడీడీ ఈవో ధర్మారెడ్డి వివరించారు.