నేనే అసలు భార్యని.. ఆమెది త్యాగం కాదు.. టిక్‌టాక్ ప్రేమకథలో ట్విస్ట్
రెండో పెళ్లి చేసుకున్న యువతి నిత్యశ్రీ .. తానే కల్యాణ్‌కు అసలు భార్యనని.. తన భర్త ముందు పెళ్లి చేసుకున్న విమలను దయచేసి త్యాగమయిగా పిలవొద్దని కోరింది.
తిరుపతి జిల్లా డక్కిలిలో కొద్ది రోజుల కిందట తన భర్తకు ప్రియురాలితో దగ్గరుండి పెళ్లి చేయించింది ఓ భార్య. ఇందుకు సంబంధించి ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ ప్రేమకథ ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. రెండో పెళ్లి చేసుకున్న యువతి నిత్యశ్రీ .. తానే కల్యాణ్‌కు అసలు భార్యనని.. తన భర్త ముందు పెళ్లి చేసుకున్న విమలను దయచేసి త్యాగమయిగా పిలవొద్దని కోరింది.
భార్య దగ్గర ఉండి భర్తకు ప్రియురాలితో పెళ్లి జరిపించింది.. అనే వార్త వైరల్ అయిన తర్వాత.. ముగ్గురు ఎటువంటి గొడవలు లేకుండా కలిసి ఉండాలని చాలామంది వారికి సూచించారు. అయితే పెళ్లయిన గంటకే వారి ముగ్గురి మధ్య విభేదాలు తలెత్తడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
నిత్యశ్రీ ఓ మీడియా సంస్థతో ఈ వివరాలు అన్ని స్వయంగా వెల్లడించింది. 'నాది విశాఖపట్నం.టిక్‌టాక్ వీడియోలు చేసుకునే నాకు.. టిక్‌టాక్ లోనే తిరుపతి జిల్లా డక్కిలికి చెందిన కల్యాణ్ పరిచయమయ్యాడు. ఇద్దరం మూడేళ్లపాటు ప్రేమించుకున్నాం. పని నిమిత్తం నేను విశాఖ నుంచి వెళ్లి హైదరాబాద్‌లో ఉంటుండగా కల్యాణ్ అక్కడికి రెండు నెలలకు ఒకసారి వచ్చి వెళ్లేవాడు. తన చెల్లెలికి పెళ్లి చేయాలని.. మంచి ఉద్యోగం సంపాదించాలని అప్పటివరకు పెళ్లి చేసుకోనని నాకు చెప్పేవాడు.
అతడి తల్లిదండ్రులు కూడా నాతో మాట్లాడేవారు. అయితే కడప జిల్లాకు చెందిన టిక్‌టాక్ వీడియోలు చేసుకునే విమలతో కల్యాణ్‌కు ఎప్పుడు పరిచయం అయిందో నాకు తెలియదు. వారికి ఇటీవల పెళ్లి అయినట్లు నాకు కల్యాణ్ తల్లిదండ్రులే స్వయంగా ఫోన్ చేసి తెలిపారు. అందుకే నేను డక్కిలికి వచ్చాను. నెల రోజుల కిందటే వాళ్లిద్దరికీ పెళ్లి అయినట్లు తెలుసుకున్నాను.
కల్యాణ్ నన్ను ప్రేమించి మోసం చేశాడు కాబట్టే అబద్దం ఆడి అయినా అతడి జీవితంలోకి వెళ్లాలని.. 'ముగ్గురం కలిసి ఉందాం'.. అని విమలను కోరాను. పెళ్లైన మరుక్షణమే ముగ్గురం కలిసి ఉండటం నాకు ఇష్టం లేదు.. నా నిర్ణయం మార్చుకున్నాను.. అని కల్యాణ్‌కి చెప్పాను. దీంతో గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టారు. కల్యాణ్ 15 రోజులు విమల వద్ద.. 15 రోజులు నా వద్ద ఉండాలని నిర్ణయించారు. అయితే కల్యాణ్ నా వద్దకు వచ్చి నెలలో ఐదు రోజులు మాత్రమే నీ వద్ద ఉంటానని చెప్పాడు.
పెళ్లయిన తర్వాత గంట సేపు మాత్రమే నాతో మాట్లాడాడు. ఆ తర్వాత అతడు విమలతో కలిసి వెళ్లి పోయాడు. నా పెళ్లి కల్యాణ్‌అమ్మానాన్నల ఇష్టంతో.. గ్రామ పెద్దల సమక్షంలో.. దైవ సన్నిధిలో జరిగింది. కళ్యాణ్, విమలల పెళ్లి కల్యాణ్ తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అసలు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది.. అనే దానికి ఆధారాలు కూడా లేవు. మూడో వ్యక్తి కూడా పక్కన లేకుండా విమల మెడలో కల్యాణ్ తాళికట్టాడని అంటున్నారు.
విమలకు ఇదివరకే పెళ్లి అయింది. ఒక బాబు కూడా ఉన్నాడు. అలాంటప్పుడు ఆమె కల్యాణ్‌కు మొదటి భార్య ఎలా అవుతుంది. నేను, కల్యాణ్ మూడేళ్లు ప్రేమించుకున్నాం. విమల మా మధ్యలోకి వచ్చింది. ఆమె త్యాగమయి ఎలా అవుతుంది. దయచేసి ఆమెను అలా పిలవొద్దని మీడియాను కోరుతున్నా. కల్యాణ్ నాతో నెలలో 5 రోజులే ఉంటానని అంటున్నాడు. పెళ్లయిన వెంటనే విమలతో వెళ్ళిపోయాడు. ఆమెకు అన్యాయం చేయమని చెప్పను. కానీ నాకు న్యాయం జరిగేలా చూడండి' అని నిత్యశ్రీ కోరింది. ఈ టిక్ టాక్ ప్రేమ పెళ్లిలో ఈ తాజా ట్విస్ట్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.