తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్..పరేషాన్
ఎమ్మెల్యే సీట్లు ఆశిస్తున్నవారిలో తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ ముందు వరసలో ఉంటారు. కీలక పదవిలో సెటిల్ కావడమే జీవితాశయంగా రాజకీయాల్లో కొనసాగుతున్న శ్రీకాంత్‌కి ఏ సమీకరణమూ కలిసి రావడంలేదు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలతోపాటు వివిధ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లను నియమించారు. వీరికి నిధులు, విధులు లేకపోయినా చెప్పుకోవడానికి ఓ పదవి ఉండటంతో ఇన్నాళ్లూ ఈ కార్పొరేషన్ల చైర్మన్లు తమ నేమ్ బోర్డుతో పర్యటనలు సాగించేవారు. రెండేళ్ల కాలపరిమితి ముగిసిపోతుండడంతో మరోసారి తమ పదవిని రెన్యువల్ చేస్తారనే ఆశతో కొందరున్నారు. మరికొందరు కుల బలంతో ఎమ్మెల్యే సీట్లు ఆశిస్తున్నారు. వీరిలో తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ ముందు వరసలో ఉంటారు. కీలక పదవిలో సెటిల్ కావడమే జీవితాశయంగా రాజకీయాల్లో కొనసాగుతున్న శ్రీకాంత్‌కి ఏ సమీకరణమూ కలిసి రావడంలేదు.
కాంగ్రెస్‌లో ఉన్నంత కాలమూ ధర్మాన ప్రసాదరావు బినామీ అనే పేరు తప్పించి సాధించిన పదవి ఏదీ లేదు. వైసీపీలో చేరాక ధర్మాన ముద్ర నుంచి కాస్తా బయటపడ్డారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం పాదయాత్రలో వెన్నంటి ఉన్నారు. ఈ సందర్భంగా ఖర్చు కూడా పెట్టారని అప్పట్లో ప్రచారం సాగింది. ఈ సందర్భంగా వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఏదో ఒక పదవి తప్పక ఇస్తామని శ్రీకాంత్‌కి హామీ లభించిందట. అయితే శ్రీకాంత్‌కి నియోజకవర్గం శాపంగా మారింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణంలో వివిధ పార్టీలలో కీలక రాజకీయ నేతలు శ్రీకాంత్‌కి దగ్గర బంధువులు. వారిని కాదని ఏ పార్టీ సీటిచ్చే అవకాశం లేదు. మరోవైపు శ్రీకాంత్ స్వగ్రామం పార్వతీపురం నియోజకవర్గంలోకి వస్తుంది. ఇది ఎస్సీ రిజర్వుడు. పోటీకి ఆస్కారమే లేదు. తాను సెటిలైన శ్రీకాకుళం నియోజకవర్గం గురువు ధర్మాన ప్రసాదరావుది. ఇక్కడ శ్రీకాంత్ పాత్ర ఎన్నికల కోసం పనిచేయడమే కానీ, పోటీ చేయడానికి లేదు.
పాలకొండ, రాజాం, ఎచ్చెర్ల నియోజకవర్గాలలో బంధుత్వాలు, కులబలం ఉంది. అయితే పాలకొండ ఎస్టీ, రాజాం ఎస్సీ, ఎచ్చెర్లలో ఆల్రెడీ సీటుకి తీవ్రమైన పోటీ ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ ఎమ్మెల్యే టికెట్ సాధించాలనుకున్న శ్రీకాంత్‌కి కులమే మార్గం చూపించింది. ముందుగా తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్‌గా ఎన్నికైతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 లక్షల మంది తూర్పుకాపుల ప్రతినిధిగా వైసీపీ అధిష్టానానికి దగ్గర అవ్వొచ్చని ప్లాన్ వేశాడు. కులానికి తూర్పుకాపే కానీ, ఏ రోజూ కులంతో లేడు. అప్పటికప్పుడు తూర్పుకాపు రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నిక అయిపోయాడు. అనుకున్నట్టే తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి కొట్టేశాడు. అంతా అనుకున్నట్టే ఇక్కడివరకూ సాగిపోయింది. ఇక్కడే తన జీవిత లక్ష్యమైన ఎమ్మెల్యే సీటుకి బ్రేక్ పడింది. తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్‌గా తన పదవీకాలంలో కులానికి రూపాయి నిధులు సాధించలేదు. ఒక్కరికైనా మేలు చేయలేదు. అదే సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడుగా కులం సమస్యలు ఒక్కటి పరిష్కరించలేదు.
రెండు పదవులపై ప్రయాణం చేస్తూనే పాతపట్నం వైసీపీ సీటుపై కన్నేశాడు. అక్కడి ఎమ్మెల్యే శ్రీకాంత్‌కి చాలా దగ్గర బంధువు. అయితే ఆమె పనితీరు బాగాలేదని, టికెట్ వచ్చే అవకాశంలేదని వైసీపీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఎక్కడా సీటు దొరికే అవకాశంలేని శ్రీకాంత్ పాతపట్నంలో పాగా వేయాలని ప్రయత్నాలు ఆరంభించారు. తానుండగా శ్రీకాంత్‌కి టికెట్ ఎలా ఇస్తారో చూస్తానంటోంది వైసీపీ ఎమ్మెల్యే. నియోజకవర్గంలో అత్యధికులైన తూర్పుకాపులు కమ్యూనిటీకి ఏం మేలు చేశాడో చెప్పాలని, అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఆశించవచ్చంటూ బహిరంగ లేఖలు రాస్తున్నారు. వైసీపీ స్థానిక నేతలు స్థానికేతరుడైన శ్రీకాంత్ అభ్యర్థిత్వాన్ని ససేమిరా ఒప్పుకోమంటున్నారు. దీంతో తన జీవిత లక్ష్యమైన ఎమ్మెల్యే సీటు ఈ సారి కూడా వచ్చే అవకాశంలేదని తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ పరేషాన్‌లో ఉన్నారు.