టమాటాలతో తులాభారం.. ఎందుకో తెలుసా..?
బెల్లంతోపాటు పంచదార, టమాటాలతో కూడా తులాభారం వేశారు. టమాటాల రేటు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ తులాభారం వ్యవహారం ఆసక్తిగా మారింది.
సహజంగా ఆలయాల్లో బెల్లంతోనో, పంచదారతోనో, లేదా నాణేలతోనో తులాభారం వేస్తుంటారు. ఆ నిలువెత్తు సొత్తుని దేవుడికి సమర్పిస్తారు. అది ఆనవాయితీ. కానీ ఇది ఓ అరుదైన తులాభారం. తమ కుమార్తెకు నిలువెత్తు టమాటాలతో తులాభారం వేశారు తల్లిదండ్రులు. ఆ టమోటాలను ఆలయానికి సమర్పించారు. ఆలయంలో జరిగే నిత్యాన్నదానంలో వాటిని వినియోగించాలని చెప్పారు.
అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయంలో టమాటాల తులాభారం అందర్నీ ఆకట్టుకుంది. అనకాపల్లి పట్టణానికి చెందిన మళ్ల జగ్గ అప్పారావు, మోహిని దంపతుల కుమార్తె భవిష్య మొక్కుబడి తీర్చుకోడానికి ఆలయానికి వచ్చారు. తమ కుమార్తె తరపున నిలువెత్తు బంగారం(బెల్లం) ఇస్తామని అమ్మవారికి మొక్కుకున్న తల్లిదండ్రులు ఆ మొక్కుబడి తీర్చుకున్నారు. అయితే బెల్లంతోపాటు పంచదార, టమాటాలతో కూడా తులాభారం వేశారు. టమాటాల రేటు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ తులాభారం వ్యవహారం ఆసక్తిగా మారింది. తులాభారం తర్వాత టమాటాలను నిత్యాన్నదానంకోసం ఉపయోగించారు.
టమాటాలపై జోకులు, మీమ్స్ సోషల్ మీడియాలో లెక్కలేనన్ని వైరల్ అవుతున్నాయి. ఇక టమాటా దొంగల గురించి, వాటిని కాపాడుకోడానికి పెడుతున్న సెక్యూరిటీ గురించి చెప్పక్కర్లేదు. టమాటాలు కిందపడిపోయినా, టమాటా వాహనాలకు ప్రమాదం జరిగినా.. మీడియాలో హైలెట్ అవుతోంది. ఇప్పుడీ టమాటా తులాభారం కూడా అలాగే వైరల్ గా మారింది.