నేటి నుంచి తిరుమలలో ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ.. ఇకపై నెలకోసారే ఉచిత దర్శనం
భక్తులకు గదుల కేటాయింపు కూడా ఈ టెక్నాలజీ వల్ల సులభతరం అయ్యిందని అధికారులు అంటున్నారు. సబ్సిడీని నిజమైన భక్తులు ఉపయోగించుకోవడానికి వీలు పడిందని చెప్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నేటి నుంచి సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొని రానున్నది. భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సేవలు అందించేందుకు గానూ 'ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాజీని' ఇవ్వాల్టి నుంచి ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నది. టీటీడీ అధికారుల సమాచారం మేరకు తిరుమల శ్రీవారి దర్శనం, గదుల కేటాయింపు, లడ్డూ ప్రసాదం కౌంటర్ల వద్ద తొలుత ఈ ఫేస్ రికగ్నైజేషన్ అమలు చేయనున్నారు. ఆ తర్వాత దశల వారీగా టీటీడీలోని అన్ని సేవలకు ఈ టెక్నాలజీని విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు.
గదుల కేటాయింపు కేంద్రంలో మంగళవారమే ప్రయోగాత్మకంగా ఈ టెక్నాలజీని పరిశీలించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా టెక్నాలజీ సహాయపడింది. గదులు తీసుకున్న సమయంలో ఎవరైతే వచ్చి ఫేస్ రికగ్నైజేషన్ చేశారో... తిరిగి వాళ్లు వస్తేనే కాషన్ డిపాజిట్ చెల్లిస్తారు. లేకపోతే సిస్టమ్ వారిని గుర్తించదు. ఇదే సాంకేతికతతో ఉచిత సర్వదర్శనానికి వచ్చే భక్తులకు లడ్డూలు కూడా ఇస్తారు.
తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఎంతో మంది స్వామివారిపై ఉన్న భక్తి కారణంగా నెలకు రెండు మూడు సార్లు సర్వ దర్శనానికి వస్తున్నారు. అయితే ఈ ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ కారణంగా.. ఇకపై నెలకు ఒక సారి మాత్రమే ఉచిత దర్శనానికి అనుమతి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఒకే నెలలో పదే పదే దర్శనానికి వచ్చే వారిని ఈ టెక్నాలజీ ఉపయోగించి అడ్డుకుంటామని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇలా రిపీటెడ్‌గా వచ్చే వారి వల్ల ఇతర భక్తులు కూడా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని.. క్యూ కాంప్లెక్సులో రద్దీ తగ్గించడానికే ఈ టెక్నాలజీని వాడుతున్నామని అధికారులు చెప్తున్నారు.
భక్తులకు గదుల కేటాయింపు కూడా ఈ టెక్నాలజీ వల్ల సులభతరం అయ్యిందని అధికారులు అంటున్నారు. సబ్సిడీని నిజమైన భక్తులు ఉపయోగించుకోవడానికి వీలు పడిందని చెప్తున్నారు. ఈ సిస్టమ్ అందుబాటులోకి వస్తే బ్లాక్‌లో టికెట్లు, గదులు అమ్ముకునే వారు.. బ్రోకర్లు తగ్గిపోతారని టీటీడీ చెబుతోంది. భక్తులు సబ్సిడీ ధరలకే గదులు పొందేలా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని.. తిరుమలలో జరిగే అవినీతికి పూర్తిగా చెక్ పడుతుందని అధికారులు వివరించారు.
కాగా, కొంత మంది భక్తులు నెలకు రెండు సార్లైనా తిరుమలకు వస్తుంటారు. వారికి మాత్రం ఈ టెక్నాలజీ వల్ల ఇబ్బందులు తప్పవు. స్వామి దర్శనాన్ని అడ్డుకోవడం ఏంటని అప్పుడే విమర్శలు కూడా మొదలయ్యాయి. మరి దీనికి అధికారులు ఏమని సమాధానం చెప్తారో చూడాలి.