నడకదారి భక్తులకు ఊతకర్ర.. టీటీడీ కొత్త నిర్ణయం
ఫెన్సింగ్ ఏర్పాటుపై కూడా చర్చ జరిగినా, దాని వల్ల ఉపయోగం లేదని తీర్మానించారు. చెట్లు ఎక్కే చిరుతలు ఫెన్సింగ్ ని కూడా సులభంగా దాటివేయగలవని సమావేశంలో అధికారులు తెలిపారు.
తిరుమల మెట్ల మార్గంలో చిరుత దాడి అనంతరం టీటీడీ హైలెవల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు టీటీడీ నూతన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇకపై కాలి నడకన కొండపైకి వెళ్లే ప్రతి భక్తుడికి ఒక ఊతకర్రను అందిస్తామన్నారు. భవిష్యత్తులో కాలినడకన, ఘాట్ రోడ్డులో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొత్త నిబంధనలను ఆయన ప్రకటించారు.
కొత్త నిబంధనలు..
అలిపిరి మెట్ల మార్గంలో ఉదయం 5 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే చిన్న పిల్లలను అనుమతిస్తారు. రాత్రి 10 గంటల వరకు పెద్దవారికి కూడా అనుమతి ఉంటుంది. అలిపిరి నుండి ఘాట్ రోడ్డులో తిరుమలకు బైక్ పై వెళ్లే వారికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకే అనుమతి ఉంటుంది. నడక మార్గంలో కూడా భక్తులను గుంపులు గుంపులుగా మాత్రమే పంపిస్తారు.
నడకదారిలో మార్పులు..
నడక మార్గంలో ఫోకస్ లైట్ల ఏర్పాటుకి టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఘాట్ రోడ్డులో జంతువులకు తినుబండారాలు వేయడం ఇకపై నిషిద్ధం. హోటల్స్ నుంచి వ్యర్థాలు కూడా ఎక్కడపడితే అక్కడ పడేయకుండా చర్యలు తీసుకుంటారు అధికారులు. అటవీ జంతువుల కదలికలు కనిపెట్టేందుకు 500 ట్రాప్ కెమెరాలను ఉపయోగించేందుకు, అవసరమైతే డ్రోన్లు కూడా వాడేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకంగా భక్తుల రక్షణ కోసం అటవీ శాఖ తరపున కొత్తగా సిబ్బందిని నియమించుకుంటారు. ఫెన్సింగ్ ఏర్పాటుపై కూడా చర్చ జరిగినా, దాని వల్ల ఉపయోగం లేదని తీర్మానించారు. చెట్లు ఎక్కే చిరుతలు ఫెన్సింగ్ ని కూడా సులభంగా దాటివేయగలవని సమావేశంలో అధికారులు తెలిపారు. ఇకపై నడకదారి భక్తులకు ప్రత్యేక టోకెన్లు లేకుండా సర్వదర్శనం టోకెన్లు మాత్రమే జారీ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. వన్యమృగాల సంచారం తగ్గుముఖం పట్టే వరకూ ఇదే నిబంధనలు అమలు చేస్తామన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.