Telugu Global
Andhra Pradesh

చిరుత దాడి.. టీటీడీ కీలక నిర్ణయం

ప్రస్తుతం చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేశారు అధికారులు. బాధిత కుటుంబానికి టీటీడీ నుంచి రూ. 5 లక్షలు, అటవీశాఖ నుంచి రూ. 5 లక్షలు ఎక్స్‌ గ్రేషియా అందిస్తామని ప్రకటించారు.

చిరుత దాడి.. టీటీడీ కీలక నిర్ణయం
X

అలిపిరి నడక మార్గంలో చిన్నారిపై చిరుత దాడి అనంతరం టీటీడీపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఇటీవల కాలంలో ఇది రెండో దాడి. గతంలో దాడి జరిగిన తర్వాత చిరుతను బంధించి తిరిగి అడవిలో వదిలిపెట్టారు. గుంపులు గుంపులుగా వెళ్లాలని జనాలకు సూచించారే కానీ, టీటీడీ ప్రత్యేకంగా తీసుకున్న జాగ్రత్తలేవీ లేవు. ఇప్పుడు రెండోసారి దాడి జరగడం, ఈసారి ఏకంగా చిన్నారి మృతి చెందడంతో మరింత కలకలం రేగింది. దీంతో టీటీడీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. తిరుమల నడకదారిలో గస్తీ పెంచేందుకు నిర్ణయం తీసుకుంది.

10మీటర్లకో సెక్యూరిటీ గార్డ్..

తిరుమల నడకదారిలో అక్కడక్కడా సెక్యూరిటీ చెక్ పాయింట్లు ఉంటాయి, సెక్యూరిటీ గార్డ్ లు కూడా ఉంటారు. కానీ కొంతదూరం మాత్రం ఎవరి అలికిడీ ఉండదు. అలాంటి అలికిడి లేని చోట్ల మాత్రం జంతువుల సంచారం ఎక్కువగా ఉంటుంది. గతంలో జరిగిన సంఘటన, తాజాగా చిన్నారి బలైన సంఘటన ఇలాంటి ప్రాంతాల్లోనే జరిగాయి. అక్కడ సెక్యూరిటీ ఉంటే ఈ ఘటనలు జరిగేవి కావు. అందుకే టీటీడీ సెక్యూరిటీపై దృష్టిపెట్టింది. ప్రతి 10 మీటర్లకో సెక్యూరిటీ గార్డుని ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈవో ధర్మారెడ్డి

సీసీ కెమెరాల ఏర్పాటు..

సెక్యూరిటీతోపాటు సీసీ కెమెరాల ఏర్పాటు కూడా పటిష్టం చేయబోతోంది. సీసీ కెమెరాల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతన నిఘా పెట్టేందుకు సిద్ధపడింది. ఎక్కడైనా జంతువుల కదలికలు కనపడితే అక్కడ సెక్యూరిటీని అలర్ట్ చేసేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేస్తామన్నారు అధికారులు. తిరుమల నడక మార్గంలో 500 సీసీ కెమెరాలు అదనంగా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు ఈవో ధర్మారెడ్డి.

ప్రస్తుతం చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేశారు అధికారులు. బాధిత కుటుంబానికి టీటీడీ నుంచి రూ. 5 లక్షలు, అటవీశాఖ నుంచి రూ. 5 లక్షలు ఎక్స్‌ గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా ఉండేందుకు ఎక్స్‌ పర్ట్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. నివేదిక అందిన తర్వాత చర్యలు చేపడతామన్నారు.

First Published:  12 Aug 2023 9:46 AM GMT
Next Story