ఆ రోజు ఆ మంత్రిని ఆపి వుంటే..
తిరుమల కొండకి జనం పోటెత్తుతున్నారు. వరస సెలవులు తోడవడంతో దేశవ్యాప్తంగా వున్న శ్రీవారి భక్తులు స్వామిని దర్శించుకునేందుకు తరలివచ్చారు.
తిరుమల కొండకి జనం పోటెత్తుతున్నారు. వరస సెలవులు తోడవడంతో దేశవ్యాప్తంగా వున్న శ్రీవారి భక్తులు స్వామిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. సెలవులు దేశమంతా వుండడంతో అన్నిరాష్ట్రాల నుంచి భక్తులు తిరుమలకి క్యూకట్టారు. భక్తుల రద్దీని దృష్టిలో వుంచుకుని టిటిడి కొత్తవారెవరూ తిరుమల రావొద్దని, కొన్నిరోజులు వాయిదా వేసుకోవాలని విన్నవిస్తూనే ఉంది. మరోవైపు 21వ తేదీవరకూ బ్రేక్ దర్శనాలని రద్దు చేశామని ప్రకటించింది. ఈ సెలవుల కాలంలో గరిష్టంగా శ్రీవారి దర్శనానికి 48 గంటల సమయమూ పట్టిన రోజులున్నాయి. రద్దీ ఈ స్థాయిలో వున్నప్పుడు కూడా మంత్రులు తమ ముఖ్యఅనుచరులతో తిరుమలకి తరలివస్తున్నారు.
బ్రేక్ దర్శనాలు రద్దు చేయగలిగిన టిటిడి, తిరుమల శ్రీవారి దర్శనం ప్లాన్‌ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని వినతులు పంపుతున్న టిటిడి మంత్రులు, వీవీఐపీలకి మాత్రం రెడ్‌కార్పెట్ పరుస్తోంది. దీంతో ఎంత రద్దీగా వున్న వీరు కొండకి వస్తూనే వున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం లెటర్ తీసుకొస్తే 1+6 దర్శనం కల్పిస్తారు. బోర్డు సభ్యుడి సిఫారసు లేఖ అయితే 12 మంది వరకూ దర్శనం అవకాశం ఉంటుంది. 21వ తేదీవరకూ ఇవి రద్దు చేశారు. దీంతో తమ అనుచరులు, అనుయాయులకి దర్శనం కల్పించేందుకు మంత్రులు, వీవీఐపీలే వచ్చేస్తున్నారు.
ఒక మంత్రి ప్రోటోకాల్ దర్శనం అధికారికంగా అయితే కుటుంబసభ్యులు, భద్రతా సిబ్బంది అంతా కలిసి గరిష్టంగా ఆయనతోపాటు 12 మంది వరకూ అవకాశం ఉంటుంది. నిబంధనలు తోసిరాజని అడ్డగోలు ప్రోటోకాల్‌తో దర్శనాలు చేయిస్తూ సామాన్యభక్తులకి నరకం చూపిస్తున్నారు. గత నెలలో మంత్రి సీదిరి అప్పలరాజు తన అనుచరులు 150మందితో ప్రోటోకాల్ దర్శనం చేసుకున్నారు. ఆ రోజే టిటిడి ప్రోటోకాల్ నిబంధనలు పాటించి, సీదిరి అప్పలరాజు ఆయన కుటుంబసభ్యులకి మాత్రమే దర్శనం కల్పించి వుంటే...తాజాగా రోజా తన అనుచరులతో ఇలా కొండపైకి వచ్చేసి బెదిరించి మరీ ప్రోటోకాల్ దర్శనం డిమాండ్ చేసేది కాదు. తిరుమల కొండపై రెండురోజులుగా భక్తులు క్యూలైన్లలోనే మగ్గిపోతున్న పరిస్థితుల్లో మంత్రి ఉషశ్రీ చరణ్ తన వందిమాగదులతో కొండపైకి చేరింది. టిటిడి నుంచి 50 బ్రేక్ దర్శనం, 10 సుప్రభాతం టిక్కెట్లు తెచ్చుకుని మరీ అందరికీ ప్రోటోకాల్ దర్శనం చేయించుకుని మరీ అక్కడి నుంచి వెళ్లింది.
వీఐపీ బ్రేక్, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేశామని ప్రకటించిన టిటిడి మంత్రులు, వీవీఐపీలని ఇలా వందలాది మందిని వేసుకుని కొండకి రావొద్దని చెప్పలేకపోతోంది. మంత్రి సీదిరి అప్పలరాజుని ఆ రోజు ఆపి వుంటే, ఈ రోజు రోజా ఇలా పట్టుబట్టి మరీ అడ్డగోలు ప్రోటోకాల్ దర్శనాలకి తెగబడేది కాదు. మంత్రులు తమ వంధిమాగధులతో దొడ్డిదారిన ప్రోటోకాల్ దర్శనాలకి పంపుతుండడంతో సామాన్యభక్తులకి శ్రీవారి దర్శనం గగనం అవుతోంది. ఇంకా కొండపై రద్దీ తగ్గలేదు. బుధవారం 17వ తేదీన 83,880 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 19 కంపార్ట్‌మెంట్లలో వేచి వున్న భక్తులకి దర్శనం చేసుకునేసరికి 8 గంటల సమయంపైనే పడుతోంది.