Telugu Global
Andhra Pradesh

లడ్డూ బరువుపై అపోహలొద్దు.. - టీటీడీ క్లారిటీ..

శ్రీవారి లడ్డూ ప్రసాదం 160 గ్రాముల నుంచి 180 గ్రాములు బరువు ఉంటుంది. కార్మికులు త‌యారు చేసిన ల‌డ్డూ ప్రసాదాల‌ను ప్రత్యేక‌ ట్రేలో ఉంచి.. ప్రతి రోజూ అధికారులు తనిఖీ చేస్తారు. పూర్తి పారదర్శకంగా లడ్డూ ప్రసాదాల తయారీ ఉంటుంది.

లడ్డూ బరువుపై అపోహలొద్దు.. - టీటీడీ క్లారిటీ..
X

తిరుమల లడ్డూకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఇటీవల లడ్డూ ప్రసాదంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా నెలకొన్న ఓ వివాదంపై నేరుగా టీటీడీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇటీవల ఓ భక్తుడు తిరుమల లడ్డూను కౌంటర్ వద్ద కొనుగోలు చేశాడు. సాధారణంగా లడ్డూ బరువు 160 గ్రాముల నుంచి 180 గ్రాములు ఉండాలి. కానీ సదరు భక్తుడికి లడ్డూ బరువుపై డౌట్ వచ్చి దాన్ని తూకం వేయాలని కోరాడు. కొనుగోలు చేసిన లడ్డూ కేవలం 90 గ్రాముల నుంచి 110 గ్రాములు మాత్రమే ఉంది. ఆ భక్తుడు ఈ తతంగం మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఇదే అదనుగా భావించిన తెలుగుదేశం ఐటీ వింగ్ టీటీడీపై తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. దీంతో ఈ ఉదంతంపై టీటీడీ వివరణ ఇచ్చింది. తిరుమల లడ్డూ విషయంలో తాము ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తామని టీటీడీ తెలిపింది. కేవలం సాంకేతిక లోపంతోనే లడ్డూ బరువు తక్కువగా చూపించిందని.. దీన్ని కొంతమంది అనవసరంగా వివాదం చేస్తున్నారని పేర్కొన్నది. భక్తులు ఈ విషయంపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని.. పుకార్లను నమ్మొద్దని టీటీడీ సూచించింది.

'శ్రీవారి లడ్డూ ప్రసాదం 160 గ్రాముల నుంచి 180 గ్రాములు బరువు ఉంటుంది. కార్మికులు త‌యారు చేసిన ల‌డ్డూ ప్రసాదాల‌ను ప్రత్యేక‌ ట్రేలో ఉంచి.. ప్రతి రోజూ అధికారులు తనిఖీ చేస్తారు. పూర్తి పారదర్శకంగా లడ్డూ ప్రసాదాల తయారీ ఉంటుంది. దీనిపై భక్తులు అపోహ చెందవద్దు' అని టీటీడీ అధికారులు వివరణ ఇచ్చారు. వేయింగ్ మెషీన్‌లో సాంకేతిక‌ సమస్య కారణంగా ఆ వీడియోలో లడ్డూ బరువు తక్కువ చూపిస్తుందని అధికారులు తెలిపారు.

'కొన్ని వందల ఏళ్లుగా అత్యంత భ‌క్తిశ్రద్ధల‌తో లడ్డూ ప్రసాదాన్ని పోటు కార్మికులు తయారు చేస్తున్నారు. అదేవిధంగా ల‌డ్డూ బ‌రువు, నాణ్యత విష‌యంలో కూడా టీటీడీ రాజీ ప‌డ‌లేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని భక్తులు నమ్మొద్దు' అని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

First Published:  10 Nov 2022 6:34 PM IST
Next Story