Telugu Global
Andhra Pradesh

తిరుమలలో శివాజీ వివాదం..? టీటీడీ ఏమందంటే..?

శివాజీ బొమ్మ ఉన్న వాహనాలు కొండపైకి వెళ్లే విషయంలో ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది. కానీ ఇంకా ఆ వివాదాన్ని కొందరు కొనసాగిస్తున్నారు. మహారాష్ట్రలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.

తిరుమలలో శివాజీ వివాదం..? టీటీడీ ఏమందంటే..?
X

తిరుమల కొండపై శ్రీవారి ఫొటో మినహా.. ఏ రాజకీయ నాయకుడి చిత్రపటాలు కానీ, అన్యమతాల చిహ్నాలు కానీ ఉండటం నిషేధం. అలాగే ఎలాంటి మతపరమైన జెండాలు కానీ, పార్టీ కి సంబంధించిన జెండాలు, గుర్తులు కలిగి ఉన్న వాహనాలను కూడా కొండపైకి పంపించరు. ఈ క్రమంలో ఇటీవల మహారాష్ట్రకు చెందిన ఓ భక్తుడు సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్ గా మారింది. ఛత్రపతి శివాజీ ఫొటోని తీసేయాలన్నారని, జెండాను కూడా తీసేయించారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియోని సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై అప్పట్లోనే టీటీడీ వివరణ ఇచ్చింది. శివాజీ బొమ్మ ఉన్న వాహనాలు కొండపైకి వెళ్లే విషయంలో ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది. కానీ ఇంకా ఆ వివాదాన్ని కొందరు కొనసాగిస్తున్నారు. మహారాష్ట్రలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.

వారం రోజుల క్రితం టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఛత్రపతి శివాజీ బొమ్మ, జెండాతో కొండపైకి వెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. తనిఖీల అనంతరం పంపించారు. అయితే ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన భక్తులు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, శివాజీని అవమానించారంటూ రాద్ధాంతం చేశారు. ఈ విషయంలో మహారాష్ట్ర నేతలు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, మహారాష్ట్రకు చెందిన మిలింద్ నర్వేకర్ ప్రస్తుతం టీటీడీ బోర్డ్ సభ్యుడిగా ఉన్నారు. ఆయన టీటీడీ ఈవో ధర్మారెడ్డితో ఈ విషయం చర్చించారు. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆయనకు అందించి.. స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఈవో ధర్మారెడ్డి శివాజీ విగ్రహం విషయంలో క్లారిటీ ఇచ్చారు.

అన్యమతాల చిహ్నాలు, ఇతర రాజకీయ నాయకుల విగ్రహాలకు కొండపైకి అనుమతి లేదని, ఛత్రపతి శివాజీ విషయంలో అలాంటి నిబంధనలేవీ లేవని తేల్చి చెప్పారు ఈవో ధర్మారెడ్డి. శివాజీ విగ్రహం కానీ, ఆయన గుర్తుగా ఉన్న జెండాలు కానీ కొండపైకి తీసుకెళ్లే క్రమంలో ఎవరూ అడ్డు చెప్పరని అన్నారు. విజిలెన్స్ విభాగానికి కూడా దీనిపై స్పష్టమైన ఆదేశాలిస్తున్నట్టు తెలిపారు ధర్మారెడ్డి. దీంతో ఈ వివాదం సద్దుమణిగినట్టయింది.

First Published:  1 Aug 2022 7:31 AM IST
Next Story