సిరులు కురిపిస్తున్న కురులు..! - తిరుమల వెంకన్నకు కోట్లలో ఆదాయం
ఆరు నెలల కాలంలో భక్తులు సమర్పించిన తలనీలాలు 21,100 కిలోలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వాటిని గురువారం ఆన్‌లైన్ ద్వారా వేలం వేయగా రూ.47.92 కోట్ల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చింది.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి భక్తులు మొక్కుబడుల రూపంలో సమర్పించే కురులు స్వామివారి ఖజానాకు సిరులు కురిపిస్తున్నాయి. ఆలయానికి నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తులు ఏడుకొండలు ఎక్కి.. స్వామివారిని దర్శించుకొని.. తలనీలాలు సమర్పించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని భావిస్తారు. తిరుమలలో భక్తులు సమర్పించిన తలనీలాల ద్వారా ఈసారి స్వామివారికి భారీగా ఆదాయం వచ్చింది.
ఆరు నెలల కాలంలో భక్తులు సమర్పించిన తలనీలాలు 21,100 కిలోలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వాటిని గురువారం ఆన్‌లైన్ ద్వారా వేలం వేయగా రూ.47.92 కోట్ల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చింది. తాజాగా ఈ విషయాన్ని తిరుమలలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సాధారణంగా నిత్యం స్వామివారిని దర్శించుకునే భక్తుల్లో 30 శాతం మంది తలనీలాలు సమర్పిస్తుంటారు. ఆ తలనీలాలను సేకరించిన టీటీడీ సిబ్బంది గోడౌన్‌లో భద్రపరుస్తారు. వాటిని అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా సైజులను బట్టి ఐదు రకాలుగా విభజిస్తారు. వీటిలో అత్యంత పొడవైన మహిళల శిరోజాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది.