శ్రీవారి భక్తుల కోసం మొబైల్ యాప్ ప్రారంభం
ఈ యాప్ ద్వారా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవలు బుక్ చేసుకోవచ్చని టీటీడీ చైర్మన్ చెప్పారు.
తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త మొబైల్ యాప్‌ను రూపొందించింది. టీటీదేవస్థానమ్స్ పేరుతో రూపొందించిన ఈ యాప్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. భక్తుల కోసం ఇప్పటివరకు గోవింద యాప్ ఉండేదని, దానిని ఆధునికీకరించి టీటీదేవస్థానమ్స్ పేరుతో ప్రయోగాత్మకంగా దీనిని అందుబాటులోకి తెచ్చినట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ యాప్‌లో మరిన్ని అప్లికేషన్లు పొందుపరిచామని ఆయన చెప్పారు.
ఈ యాప్ ద్వారా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవలు బుక్ చేసుకోవచ్చని టీటీడీ చైర్మన్ చెప్పారు. ఈ యాప్ ద్వారా విరాళాలు కూడా అందించవచ్చని తెలిపారు. తిరుమలకు సంబంధించిన సమస్త సమాచారం ఈ యాప్‌లో అందుబాటులో ఉంటుందని ఆయన వెల్లడించారు. జియో సహకారంతో టీటీడీ ఐటీ విభాగం దీనిని రూపొందించినట్టు ఆయన తెలిపారు.
ఈ యాప్ భక్తులకు డిజిటల్ గేట్‌వేగా ఉపయోగపడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. భక్తులు ఈ యాప్‌లో లాగిన్ అయ్యేందుకు యూజర్ నేమ్‌తో పాటు ఓటీపీ ఎంటర్ చేస్తే చాలని ఆయన తెలిపారు. పాస్‌వర్డ్ అవసరం లేదని ఆయన చెప్పారు.