ఏపీలో అతిపెద్ద క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం
ఆస్పత్రిలో కీలకమైన బంకర్ బ్లాక్ కు వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ఆస్పత్రికి రూ.200 కోట్లతో అత్యాధునిక పరికరాలు, సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ వ్యాధితో బాధపడేవారెవరైనా హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రివైపు చూస్తుంటారు. అక్కడ అధునాతన చికిత్స అందుబాటులో ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏపీలో కూడా ఇప్పుడు అలాంటి అధునాతన చికిత్స అందించే ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ అంకాలజీ ఆస్పత్రి నిర్మిస్తున్నారు. ఈ ఆస్పత్రిలో అంకాలజీ భవనానికి టీటీడీ చైర్మ న్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. 124కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆస్పత్రి నిర్మిస్తున్నట్టు తెలిపారాయన.
ఆస్పత్రిలో కీలకమైన బంకర్ బ్లాక్ కు వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ఆస్పత్రికి రూ.200 కోట్లతో అత్యాధునిక పరికరాలు, సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ లోపు ఆస్పత్రి నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. 3లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, మొత్తం 400 బెడ్స్ కెపాసిటీతో ఈ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. ప్రస్తుతం తిరుపతిలో టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు శ్రీ బాలాజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ అంకాలజీ ఆస్పత్రి నిర్మిస్తున్నారు.
పింక్ బస్సులు..
క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు, టెస్టులకోసం పింక్ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ప్రతి జిల్లాకు పింక్ బస్సులు పంపిస్తామని, క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన పెంచాల్సి ఉందన్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లా నలుమూలలకు పింక్ బస్సులు పంపించి స్క్రీనింగ్ టెస్ట్ లు చేస్తున్నామన్నారు. క్యాన్సర్ ని తొలి దశలోనే గుర్తిస్తే నివారణకు అవకాశాలుంటాయని చెప్పారు.