భక్తులకు చేతి కర్ర ఇచ్చి బాధ్యతలనుంచి తప్పించుకోం..
భక్తులకు చేతి కర్ర ఇచ్చి బాధ్యతల నుంచి తప్పించుకోమని ఆయన చెప్పారు. భక్తుల భద్రతే తమకు ముఖ్యమని.. అందుకోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇటీవల తిరుమల మెట్ల మార్గంలో చిన్నారులపై చిరుతలు వరుసగా దాడులకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. దీంతో టీటీడీ అప్రమత్తం అయ్యింది. మెట్ల మార్గంలో పలుచోట్ల బోన్లు ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు మూడు చిరుత పులులను బంధించింది. ఒక చిరుతను అడవిలోనే వదిలేయగా.. మరో రెండు చిరుతలను జూ పార్కుకు తరలించారు.
అలాగే అలిపిరి కాలినడక మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది టీటీడీ. భక్తులను మెట్ల దారి గుండా గుంపులు గుంపులుగా పంపుతూ వారి భద్రత కోసం సెక్యూరిటీ గార్డులను కూడా ఏర్పాటు చేసింది. మెట్ల మార్గంలో చిన్నారులను పంపడంపై నిబంధనలు విధిస్తోంది. నడకదారి భక్తులకు రక్షణ కోసం చేతి కర్రలను కూడా అందిస్తోంది.
అయితే భక్తులకు టీటీడీ చేతి కర్రలు ఇవ్వడంపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ వచ్చాయి. ఒకవైపు చిరుత పులులు దాడి చేస్తుంటే భక్తులు చేతి కర్రలు పట్టుకొని ఏం చేయగలరు? అని కొందరు విమర్శలు చేశారు. టీటీడీ భక్తులకు చేతి కర్రలు ఇచ్చి బాధ్యతలనుంచి తప్పించుకుంటోందని ట్రోల్స్ చేశారు.
దీనిపై ఇవాళ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. భక్తులకు చేతి కర్ర ఇచ్చి బాధ్యతల నుంచి తప్పించుకోమని ఆయన చెప్పారు. భక్తుల భద్రతే తమకు ముఖ్యమని.. అందుకోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భక్తులకు భద్రత ఏర్పాట్లు కొనసాగిస్తూనే నడక మార్గంలో సంచరించే చిరుతలను బంధించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. అటవీశాఖ అధికారులు చేసిన సూచన మేరకే నడకదారి భక్తులకు చేతి కర్రలు ఇస్తున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు.
భక్తుల భద్రతలో భాగంగా మెట్ల మార్గంలో ఇప్పటివరకు 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరో రెండు వందల సీసీ కెమెరాలు త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. భక్తులకు టీటీడీ చేతి కర్రలు ఇచ్చి బాధ్యతల నుంచి తప్పించుకుంటోందని విమర్శలు చేయడం తగదని భూమన అన్నారు.