Telugu Global
Andhra Pradesh

తేదీ చెప్పను కానీ, విశాఖకు పాలనా రాజధాని పక్కా..

న్యాయపరమైన చిక్కుముడులు విడిపోయిన తర్వాత రాజధాని తరలి వస్తుందని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. విశాఖలో జీవీఎంసీ కార్పొరేటర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

తేదీ చెప్పను కానీ, విశాఖకు పాలనా రాజధాని పక్కా..
X

విశాఖపట్నంకు పాలనా రాజధాని తరలిరావడం ఖాయమంటున్నారు టీటీడీ చైర్మన్, ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారాయన. విశాఖ కార్పొరేషన్ పరిధిలో వార్డుల వారీగా అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయబోతున్నట్టు ప్రకటించారు. డెడ్ లైన్ ప్రకటించనని, తేదీల గురించి తాను మాట్లాడనని, అయితే విశాఖకు పరిపాలన రాజధాని రావడం మాత్రం ఖాయమని, న్యాయపరమైన చిక్కుముడులు విడిపోయిన తర్వాత రాజధాని తరలి వస్తుందని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. విశాఖలో జీవీఎంసీ కార్పొరేటర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాజకీయ ఉనికి కోసమే..

గోదావరి వరదలు, సహాయక చర్యలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను రాజకీయ ఉనికిపాట్లుగా అభివర్ణించారు వైవీ సుబ్బారెడ్డి. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుందని చెప్పారాయన. ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే ఎప్పుడు చేయాలి, ఫీల్డ్ విజిట్స్ ఎప్పుడు చేయాలనేది ప్రతిపక్షాలు నిర్ణయించాల్సిన అంశాలు కావని అన్నారు సుబ్బారెడ్డి. వరదల విషయంలో ప్రతిపక్షాలు తమ ఉనికి కోసమే విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.

శ్రావణ భార్గవి అంశంపై..

ప్రస్తుతం ఏపీలో శ్రావణ భార్గవి - అన్నమయ్య కీర్తనల అంశం హాట్ టాపిక్ గా ఉంది. యూట్యూబ్ లో ఆ పాట ఆడియోని డిలీట్ చేసినా ఇంకా ఆ వ్యవహారం లైమ్ లైట్లోనే ఉంది. ఈ విషయంపై మీడియా అడిగిన ప్రశ్నలకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. శ్రావణ భార్గవి పాటల వివాదం టీటీడీకి సంబంధించినది కాదన్నారు. చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటే పరిశీలిస్తామన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వాటి మీద ఏ విధంగా స్పందించాలని మీడియాని ప్రశ్నించారాయన. వేంకటేశ్వర స్వామికి ప్రియ భక్తుడైన అన్నమయ్య పాటకు అపచారం కలిగించడం అంటే మహా పాపం అని అన్నారు. తొలి వాగ్గేయకారుడిగా అన్నమయ్యను గౌరవించుకుంటున్నామని, అందుకే ఆయన పేరు మీద జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్ సూచనల మేరకే తిరుమల కొండపైకి అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు.

First Published:  25 July 2022 1:46 AM GMT
Next Story