Telugu Global
Andhra Pradesh

4,411 కోట్లతో టీటీడీ బడ్జెట్..

విశేషం ఏంటంటే.. కొవిడ్ కి ముందు ఉన్నదానికంటే కొవిడ్ తర్వాతే శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. కొవిడ్‌ కు ముందు ఏడాదికి రూ.1200కోట్ల కానుకలు లభిస్తే.. ఆ తర్వాత అది రూ.1500 కోట్ల వరకు పెరిగింది.

4,411 కోట్లతో టీటీడీ బడ్జెట్..
X

2023-24 ఆర్థిక సంవత్సరానికి టీటీడీ 4,411 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రతిపాదించింది. గత నెలలోనే బడ్జెట్ తోపాటు, అభివవృద్ది కార్యక్రమాలకు నిధుల కేటాయింపుపై తీర్మానం చేసినా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అప్పట్లో ప్రకటన విడుదల చేయలేదు. తాజాగా కోడ్ ముగియడంతో వివరాలు వెల్లడించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.

లడ్డూ విక్రయాలకు అదనంగా 30కౌంటర్లు..

తిరుమల లడ్డూల విక్రయం కోసం రూ.5.25కోట్లతో మరో 30 కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు టీటీడీ చైర్మన్. తమిళనాడులోని ఉల్లందూరుపేటలో నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు రూ.4.70 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. తిరుపతిలోని SGS ఆర్ట్స్ కాలేజీలో అదనపు అంతస్తు నిర్మాణం కోసం రూ.4.71 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

ఆదాయం పెరిగింది..

కొవిడ్‌ సమయంలో భక్తుల దర్శనాలు లేకపోవడంతో శ్రీవారి హుండీ ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఆ తర్వాత మెల్ల మెల్లగా భక్తుల రాక పెరిగింది. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. విశేషం ఏంటంటే.. కొవిడ్ కి ముందు ఉన్నదానికంటే కొవిడ్ తర్వాతే శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. కొవిడ్‌ కు ముందు ఏడాదికి రూ.1200కోట్ల కానుకలు లభిస్తే.. ఆ తర్వాత అది రూ.1500 కోట్ల వరకు పెరిగింది. బ్యాంకుల్లో ఉన్న టీటీడీ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లు రేట్లు పెరిగాయని తెలిపారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.

ఏప్రిల్ లోగా శ్రీనివాస సేతు..

తిరుపతిలో శ్రీనివాస సేతు పనులను ఏప్రిల్‌ లోగా పూర్తి చేస్తామన్నారు టీటీడీ చైర్మన్. అలిపిరి నుంచి వకుళామాత ఆలయం వరకు కొత్త రోడ్డు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. వీఐపీ బ్రేక్‌ దర్శనం సమయాన్ని మార్చడం వల్ల సామాన్య భక్తులకు సౌలభ్యంగా ఉందని ఇకపై కూడా అదే విధానాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

First Published:  22 March 2023 2:55 PM IST
Next Story