కర్రలొచ్చేశాయ్.. భక్తులు సిద్ధమేనా..?
నిలువెత్తు కర్రలను శాంపిల్ గా టీటీడీ తెప్పించింది. వాటిని భక్తులకు ఇచ్చి కొండపైకి వెళ్లాక మళ్లీ వారి దగ్గరనుంచి తీసుకునే విధంగా చర్యలు చేపట్టింది. ఈ కర్రలు అలిపిరికి చేరుకున్నాయి.
కాలి నడకన తిరుమల వెళ్లే భక్తులకు ఊతకర్రలు ఇస్తామని ఇటీవల టీటీడీ ప్రకటించింది. ఇప్పుడా కర్రలు అలిపిరి చేరుకున్నాయి. నిలువెత్తు కర్రలను శాంపిల్ గా టీటీడీ తెప్పించింది. వాటిని భక్తులకు ఇచ్చి కొండపైకి వెళ్లాక మళ్లీ వారి దగ్గరనుంచి తీసుకునే విధంగా చర్యలు చేపట్టింది. ఈ కర్రలు అలిపిరికి చేరుకున్నాయి.
ఆరేళ్ల పాపపై చిరుత దాడి ఘటన అనంతరం కాలినడక భక్తులకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది టీటీడీ. హైలెవల్ మీటింగ్ తర్వాత భక్తులకు ఊతకర్రలు ఇస్తామని, కొండపైకి వెళ్లే సమయంలో ఇవి వారికి ఉపయోగపడతాయని చెప్పారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అయితే ఈ ఊతకర్రల ఐడియాపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. కౌంటర్ గా వైసీపీ అనుకూల మీడియా కూడా కథనాలిస్తోంది. అడవి జంతువులబారినుండి రక్షించుకోడానికి ఊతకర్రలు ఎలా ఉపయోగపడతాయనే విషయంపై వివరణాత్మక కథనాలు ప్రచురిస్తోంది. ఈ దశలో ఊతకర్రలు ఇప్పుడు అలిపిరి చేరుకోవడం విశేషం.
చిరుత దాడికి తెగబడితే చేతిలో కర్ర ఉంటే ఎతం ఉపయోగం అనే విషయం పక్కనపెడితే.. కర్ర దగ్గర ఉంటే మానసికంగా భక్తులకు ధైర్యం పెరుగుతుంది. అదే సమయంలో జంతువులో కూడా భయం మొదలవుతుంది. అందుకే ఈ కర్రల ఉపాయం తెరపైకి వచ్చింది. అయితే ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యమో చూడాలి. కొంతమంది భక్తులు మెట్లపూజ చేస్తూ కొండపైకి ఎక్కుతుంటారు. అలాంటివారి చేతిలో పసుపు, కుంకుమ, కర్పూరం, కొవ్వొత్తి ఉంటాయి.. వారి బంధువులు మిగతా సరంజామా పట్టుకుని సహాయం చేస్తుంటారు. ఇలాంటి వారికి ఊతకర్ర అదనపు లగేజీ మాత్రమే అని చెప్పాలి. అయితే ఈ నిబంధన అమలు ఎలా ఉంటుందనేది మరి కొన్ని రోజుల్లో తేలిపోతుంది.