Telugu Global
Andhra Pradesh

వేసవిలో వీఐపీ దర్శనాల కుదింపు.. టీటీడీ సంచలన నిర్ణయం

ప్రత్యేక దర్శనాలను కూడా తగ్గిస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి రద్దీలో కూడా సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామంటోంది టీటీడీ పాలక మండలి.

వేసవిలో వీఐపీ దర్శనాల కుదింపు.. టీటీడీ సంచలన నిర్ణయం
X

వేసవి సెలవలు పూర్తిగా మొదలు కాకముందే తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ముందు ముందు మరింత రద్దీ పెరుగుతుందనే అంచనాలున్నాయి. ఈ దశలో వేసవిలో వీఐపీ దర్శనాలను కుదిస్తూ టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక దర్శనాలను కూడా తగ్గిస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి రద్దీలో కూడా సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామంటోంది టీటీడీ పాలక మండలి.

నడకదారి భక్తులకు టికెట్లు కేటాయిస్తున్నామని, దీన్ని కొనసాగిస్తామని చెప్పారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు, స్వామివారి కల్యాణం విజయవంతంగా జరిగాయన్నారు. ఇకపై తిరుమల స్వామివారి ప్రసాదం కోసం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి కాబట్టి, దీనిపై పాలకమండలి లో చర్చించామన్నారు.

టీటీడీ అవసరాలకు గాను ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల ఉత్పత్తుల కొనుగోలుకు ధరలు నిర్ణయించేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. రైతు సాధికార సంస్థ, మార్క్ ఫెడ్ తో చర్చించేందుకు టీటీడీ బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సనత్ కుమార్, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో కమిటీ ఏర్పాటు చేశారు.

టీటీడీ గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీ ఆధునీకీకరణకు 14 కోట్ల రూపాయలు వెచ్చించబోతున్నట్టు తెలిపారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి 12 కోట్లు కేటాయించారు. తిరుపతి విద్యాసంస్థలలో కాంట్రాక్ట్ సిబ్బందిని కొనసాగిస్తూ.. అవసరమైన శాశ్వత ఉద్యోగులను నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఢిల్లీలో ఎస్వీ కాలేజ్ లో ఆడిటోరియం అభివృద్ధికి రూ.4.13 కోట్లు కేటాయించారు. ఢిల్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తరహాలో మే నెల 3 నుండి 16 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.

తిరుపతిలో శ్రీనివాస సేతు పనులు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఫారిన్ కరెన్సీ మార్పిడికి టీటీడీకి అన్ని అనుమతులు ఉన్నాయన్నారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. లైసెన్స్ రెన్యువల్ కోసం FCRA అధికారుల సూచనల మేరకు రూ.3కోట్లు చెల్లించామని, ఆ సొమ్ముని తిరిగి పొందడానికి కృషి చేస్తున్నామని చెప్పారు.

First Published:  15 April 2023 4:38 PM IST
Next Story