బాబుకి హ్యాండిచ్చారు.. మోదీ పరువు తీస్తున్నారు..
అప్పట్లో మోదీని తిట్టిన తిట్టు తిట్టకుంటా చంద్రబాబు ఎలా వ్యవహరించారో, ఇప్పుడు మోదీ ప్రాపకం కోసం ఎలా పాకులాడుతున్నారో పోలుస్తూ ఈ వీడియోలు బయటకు వదులుతున్నారు.
తల్లిని, పెళ్లాన్ని సరిగా చూసుకోలేని మోదీ, దేశాన్ని ఏం ఉద్ధరిస్తారు..?
ప్రచార ప్రధాని మోదీ.. దేశాన్ని పాలించే సత్తాలేని మోదీ..
మతాల మధ్య చిచ్చుపెట్టిన మోదీ
ఏటీఎంలను దిష్టిబొమ్మలుగా చేశారు, డీమానిటైజేషన్ పెద్ద కుంభకోణంగా మార్చారు..
విఫల ప్రధాని నరేంద్ర మోదీ..
ఈ విమర్శలన్నీ చాలాకాలం క్రితం చంద్రబాబు నోటినుంచి వచ్చినవే. సోషల్ మీడియా పుణ్యమా అని మళ్లీ ఇవి హైలైట్ అవుతున్నాయి, ట్రెండింగ్ లోకి వచ్చాయి. అప్పుడెప్పుడో చంద్రబాబు మోదీకి చీవాట్లు పెడితే, ఇప్పుడెందుకు ఆ మాటలు హైలైట్ అవుతున్నాయి. అసలేంటి కథ..?
ఒకే ఒక్క షేక్ హ్యాండ్.. చంద్రబాబు అనుకూల మీడియా రకరకాల ఊహాగానాలు వల్లె వేస్తోంది, అదే షేక్ హ్యాండ్ అటు మోదీ పరువు కూడా బజారుకీడుస్తోంది. అవును, మోదీ-చంద్రబాబు ప్యాచప్ అయ్యారంటూ టీడీపీ అనుకూల మీడియా హడావిడి చేస్తుంటే.. దానికి దీటుగా సోషల్ మీడియాలో మోదీని చంద్రబాబు తిట్టిన తిట్లు బయటకు తీస్తున్నాయి వైరి వర్గాలు. అప్పట్లో మోదీని తిట్టిన తిట్టు తిట్టకుంటా చంద్రబాబు ఎలా వ్యవహరించారో, ఇప్పుడు మోదీ ప్రాపకం కోసం ఎలా పాకులాడుతున్నారో పోలుస్తూ ఈ వీడియోలు బయటకు వదులుతున్నారు.
ఎరక్కపోయి ఇరుక్కుపోయారు..
ఆ మధ్య తెలంగాణ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ మొదలైంది. సోషల్ మీడియా దెబ్బకి హడలిపోయారు మోదీ. ఇప్పుడు అనుకోకుండా చంద్రబాబుకి షేక్ హ్యాండ్ ఇచ్చి మరోసారి నెటిజన్లకు బుక్కయ్యారు. మోదీ రాజకీయం వేరే, ఆయన టార్గెట్ వేరే. అలాగే చంద్రబాబు వ్యవహారం కూడా వేరే, ఆయన స్వలాభం వేరే. కానీ వీరిద్దరి కరచాలనం వెనక ఉన్న గత కాలపు తిట్లన్నీ ఇప్పుడు బయటపడటం ఇద్దరికీ ఇబ్బందిగానే మారింది. మోదీని అన్నన్ని మాటలన్న చంద్రబాబు ఇప్పుడు నిస్సిగ్గుగా ఎలా చేయి కలుపుతారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుతో అన్ని తిట్లు తిన్న మోదీ.. ఇప్పుడు అవన్నీ దులిపేసుకుని ఎలా షేక్ హ్యాండ్ ఇస్తారంటూ చురకలంటిస్తున్నారు. మొత్తమ్మీద చంద్రబాబు ఢిల్లీ పర్యటన, ఏపీలో నెటిజన్లకు బాగా పని కల్పించింది. మోదీ పరువు బజారుకీడుస్తోంది.