Telugu Global
Andhra Pradesh

పంద్రాగస్ట్ ప్రసంగాలు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ లు..

గతంలో నేతల ప్రసంగాల్లో అచ్చుతప్పులకోసం, అక్షర దోషాలకోసం పెద్దగా వెదుకులాట ఉండేది కాదు. విధాన పరమైన నిర్ణయాలను మాత్రమే విమర్శించేవారు. కానీ, ఇప్పుడు అసలు విషయాలు వదిలేసి కొసరు విషయాలతో సంబరపడిపోతున్నారు.

పంద్రాగస్ట్ ప్రసంగాలు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ లు..
X

గతంలో నేతల ప్రసంగాలలో సిద్ధాంత పరమైన వ్యతిరేకత ఉంటే కచ్చితంగా దాన్ని వేలెత్తి చూపుతూ విమర్శలు వెల్లువెత్తేవి. కానీ సోషల్ మీడియా కాలంలో అక్షర దోషాలదే హడావిడి, రాద్ధాంతం. అందులోనూ ఏపీలో ఇటీవల కాలంలో ఇలా తప్పులెన్నడం ట్రెండ్ గా మారింది. అయ్యయ్యో సీఎం జగన్ కి ఫలానా పదం పలకడం కూడా రాలేదని టీడీపీ ఈ ట్రోలింగ్ మొదలు పెడితే.. చంద్రబాబుకి వయసైపోయింది, ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడంలేదంటూ వైసీపీ దాన్ని కొనసాగిస్తోంది. తాజాగా స్వాతంత్ర దినోత్సవాల్లో జగన్, చంద్రబాబు ప్రసంగాలపై ఇలాగే ట్రోలింగ్ లు మొదలయ్యాయి.

స్వాతంత్ర వేడుకల్లో జగన్ ఓవైపు ప్రసంగిస్తుండగానే, మరోవైపు టీడీపీ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి కామెంట్లు మొదలయ్యాయి. ఉటంకించారు బదులు, ఉటకించారు అన్నారని, లక్ష్యాల బదులు లక్షణాలు అంటున్నారని ట్రోలింగ్ మొదలు పెట్టారు. అయితే వైసీపీ కూడా దీనికి దీటుగానే కౌంటర్లిచ్చింది. చంద్రబాబు వందేళ్ల స్వాతంత్రం అంటున్నారని, ముసలోడికి చిప్ దొబ్బిందని వైసీపీ సోషల్ మీడియా అకౌంట్లనుంచి ట్రోలింగ్ మొదలైంది.

గతంలో నేతల ప్రసంగాల్లో అచ్చుతప్పులకోసం, అక్షర దోషాలకోసం పెద్దగా వెదుకులాట ఉండేది కాదు. విధాన పరమైన నిర్ణయాలను మాత్రమే విమర్శించేవారు. కానీ, ఇప్పుడు అసలు విషయాలు వదిలేసి కొసరు విషయాలతో సంబరపడిపోతున్నారు. మీ నేత ఆ పదాన్ని తప్పుగా పలికారంటే, అసలు మీ నాయకుడి ఇంగ్లీషే సరిగ్గా రాదంటూ మరొకరు కొత్త పల్లవి అందుకుంటున్నారు. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా విమర్శలు మరీ శృతి మించినట్టు అనిపిస్తోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సీఎం ప్రసంగంలో తప్పులు అంటూ ఓ అరపేజీ కేటాయించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

First Published:  16 Aug 2022 8:55 AM IST
Next Story