Telugu Global
Andhra Pradesh

నిజం గెలవాలంటే నిజం చెప్పాలి.. భువనేశ్వరిపై ట్రోలింగ్

'నిజం గెలవాలి' అనే పేరే కాస్త అతిగా ఉందని నెటిజన్లు అంటున్నారు. అవినీతి కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకి శిక్ష పడితే 'నిజం గెలిచినట్టు' అవుతుందని, ఆయన బెయిలుపై బయటకొస్తే నిజం ఎలా గెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు..?

నిజం గెలవాలంటే నిజం చెప్పాలి.. భువనేశ్వరిపై ట్రోలింగ్
X

'నిజం గెలవాలి' అనే కార్యక్రమం ద్వారా నారా భువనేశ్వరి ప్రజల్లోకి రాబోతున్నారని అంటున్నారు. అయితే అప్పుడే ఈ కార్యక్రమంపై ట్రోలింగ్ మొదలైంది. 'నిజం గెలవాలి' అంటే ముందు చంద్రబాబు కోర్టులో 'నిజం చెప్పాలి' అంటూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. చంద్రబాబు కోర్టుకి అబద్ధాలు చెప్పినంతకాలం నిజం ఎలా గెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు అరెస్టు తర్వాత.. ఆవేదనకు గురై 105 మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు మృతి చెందారని ఎల్లో మీడియా.. రోజూ లిస్ట్ ప్రచురిస్తోంది. ఆయా కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పేందుకు ఇప్పుడు భువనేశ్వరి బయలుదేరుతున్నారు. ఈ కార్యక్రమానికి 'నిజం గెలవాలి' అనే పేరు పెట్టారు. వాస్తవానికి ఇలాంటి పరామర్శల కార్యక్రమం తాను మొదలుపెడతానన్నారు బాలకృష్ణ. కానీ ఆయనకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా నారా కుటుంబమే రంగంలోకి దిగింది. 'నిజం గెలవాలి' అంటూ పరామర్శల పేరుతో రాజకీయం మొదలు పెట్టింది.

చంద్రబాబు ఇక జైలునుంచి బయటకు రారు, ఒకవేళ వచ్చినా మునుపటిలా యాక్టివ్ గా ఉండలేరు అని టీడీపీ నాయకులకు అర్థమైంది. అందుకే ఆయన స్థానంలో భువనేశ్వరిని తెరపైకి తెచ్చారు. సెంటిమెంట్ పండించేందుకు సిద్ధమయ్యారు. భువనేశ్వరి యాత్రలు వర్కవుట్ కాకపోతే బ్రాహ్మణి ఉండనే ఉన్నారు. లోకేష్ యాత్రలకు ఏపాటి స్పందన వస్తుందో ఈపాటికే అందరికీ అర్థమైంది. అందుకే మహిళా సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించాలనుకుంటోంది టీడీపీ. కానీ 'నిజం గెలవాలి' అనే పేరే కాస్త అతిగా ఉందని నెటిజన్లు అంటున్నారు. అవినీతి కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకి శిక్ష పడితే 'నిజం గెలిచినట్టు' అవుతుందని, ఆయన బెయిలుపై బయటకొస్తే నిజం ఎలా గెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు..? అది జరగాలంటే చంద్రబాబు నిజం చెప్పాలని, తప్పులన్నీ ఒప్పుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.

First Published:  19 Oct 2023 9:30 AM IST
Next Story