టీడీపీ, జనసేన మధ్య ఓట్ల బదిలీ అనుమానమే..
సీట్ల పంపకంలో చంద్రబాబు జనసేనకు సాధ్యమైనన్ని తక్కువ స్థానాలు కేటాయించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమ పార్టీకి తగినన్ని సీట్లు కేటాయించకపోతే జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశాలున్నాయి.
టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చలు కొలిక్కి రావడానికి ఎంత సమయం పడుతుందనేది చెప్పలేని స్థితి. ఓ వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దశలవారీగా అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ ప్రజల్లోకి దూసుకుపోవడానికి వారికి అవకాశం కల్పిస్తుంటే, మరో వైపు జనసేన` టీడీపీ మాత్రం సీట్ల పంపకాల వద్దనే మల్లగుల్లాలు పడుతున్నాయి.
సీట్ల పంపకం జరిగి, అభ్యర్థుల ఖరారు జరిగిన తర్వాత స్థానికంగా తలెత్తే విభేదాలను పరిష్కరించడానికి టీడీపీ, జనసేనలకు మరింత సమయం పడుతుంది. ఈలోగా వైసీపీ అభ్యర్థులు ప్రజల్లోకి దూసుకెళ్తారు. ఆ తర్వాత జనసేన, టీడీపీ మధ్య ఓట్ల బదిలీ జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ అవుతాయని, జనసేనకు టీడీపీ ఓట్లు బదిలీ కావనే అభిప్రాయం ఒకటి ప్రచారంలో ఉంది.
అయితే, సీట్ల పంపకంలో చంద్రబాబు జనసేనకు సాధ్యమైనన్ని తక్కువ స్థానాలు కేటాయించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమ పార్టీకి తగినన్ని సీట్లు కేటాయించకపోతే జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశాలున్నాయి. దాంతో టీడీపీకి జనసేన ఓట్లు బదిలీ కావడం కూడా కష్టమే కావచ్చు.
సీట్ల పంపకంలో, అభ్యర్థుల జాబితా ప్రకటనలో జాప్యం ఎంత జరిగితే అంతగా ఓట్ల బదిలీ విషయంలో సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. ఏమైనా జనసేన, టీడీపీల మధ్య కిందిస్థాయిలో సమన్వయం కుదురుతుందా అనేది కూడా అనుమానమే.