డీఎం బదిలీ.. వైసీపీ ఆఫీస్ భూమిపై అవాస్తవ ఫిర్యాదు కారణమా..?
స్థలంపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు అది ఆర్టీసీది కాదని తేల్చారు. 2003లోనే ఆర్టీసీ నుంచి ఈ భూమిని ఏపీఐఐసీ తీసుకుందని కలెక్టర్ వెల్లడించారు.
బాపట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ బదిలీ వెనుక వైసీపీ కార్యాలయానికి కేటాయించిన స్థల వ్యవహారం ఉందన్న ప్రచారం నడుస్తోంది. శ్రీనివాస్‌రెడ్డిని ఆర్టీసీ కేంద్ర కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు.
ఇటీవల బాపట్లలో విలువైన భూమిని వైసీపీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించారు. అయితే ఆ స్థలం ఆర్టీసీదని.. సంస్థ అనుమతి లేకుండా ఎలా కేటాయిస్తారని డిపో మేనేజర్‌గా ఉన్నశ్రీనివాస్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఈ విషయాన్నిభూమి పూజకు వచ్చిన వైసీపీ ప్రజాప్రతినిధులకే తెలియజేసి అభ్యంతరం తెలిపారు. తన అభ్యంతరాలను పట్టించుకోకుండా భూమి పూజ కూడా నిర్వహించడంతో .. దీనిపై డిసెంబర్ 19న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌కు ఫిర్యాదు ఇచ్చారు శ్రీనివాస్ రెడ్డి.
అయితే స్థలంపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు అది ఆర్టీసీది కాదని తేల్చారు. 2003లోనే ఆర్టీసీ నుంచి ఈ భూమిని ఏపీఐఐసీ తీసుకుందని కలెక్టర్ వెల్లడించారు. దాంతో పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదును డీఎం శ్రీనివాస్ రెడ్డి వెనక్కు తీసుకున్నారు. స్థలం ఎవరిది అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో నిర్ధారించుకోకుండా శ్రీనివాస్ రెడ్డి చేసిన ఆరోపణల కారణంగా ప్రభుత్వం ఇరుకునపడిందని అధికారులు గుర్తించారు.
కనీసం డాక్యుమెంట్లను కూడా పరిశీలించకుండా డీఎం ఆ భూమి ఆర్టీసీది అంటూ అడ్డుపడ్డారని నిర్ధారించారు. శ్రీనివాస్ రెడ్డి తీరు కారణంగా ఉన్నతాధికారులు కూడా అవాస్తవాలతో కూడిన ప్రకటనలు చేసి ఇబ్బందిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను కేంద్ర కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు.