ఏపీలో సేమ్ సీన్.. అర్థరాత్రి ఆమె గది తలుపు తట్టిన డిప్యూటీ తహశీల్దార్
నేరుగా డిప్యూటీ కలెక్టర్ గదిలోకి వెళ్లేందుకు తలుపు తట్టాడు. ఆమె అప్రమత్తమయ్యారు. గది బయట వ్యక్తిని చూసి షాకయ్యారు. వెంటనే 112కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
ఇటీవల హైదరాబాద్ లో ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్థరాత్రి అనుమతి లేకుండా డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్ కుమార్ అనే వ్యక్తి ప్రవేశించడం, ఆమె గది తలుపు తట్టడం, సబర్వాల్ ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం, ఆ తర్వాత ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేయడం.. తెలిసిన విషయమే. అయితే ఏపీలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. ట్రైనీ డిప్యూటీ తహశీల్దార్... అర్థరాత్రి వేళ మహిళా డిప్యూటీ కలెక్టర్ గది తలుపు తట్టడం చర్చనీయాంశమైంది. అది కూడా మంగళగిరిలోని హెచ్ఆర్డీఏ శిక్షణ కేంద్రంలో కావడం విశేషం. ఈ ఘటనలో డిప్యూటీ కలెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు, డిప్యూటీ తహశీల్దార్ ని అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగింది..?
అనంతపురానికి చెందిన సతీష్, గుంటూరు జిల్లా మంగళగిరి పరిధి కాజ సమీపంలోని ఏపీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూట్ (HRDI) లో డిప్యూటీ తహశీల్దార్ గా శిక్షణ తీసుకుంటున్నారు. అదే కేంద్రంలో మహిళా డిప్యూటీ కలెక్టర్ కూడా శిక్షణ కోసం వచ్చారు. అయితే తెల్లవారు ఝామున 2గంటల సమయంలో సతీష్, డిప్యూటీ కలెక్టర్ బస చేస్తున్న VKNK అపార్ట్ మెంట్ కి వెళ్లాడు. నేరుగా డిప్యూటీ కలెక్టర్ గదిలోకి వెళ్లేందుకు తలుపు తట్టాడు. ఆమె అప్రమత్తమయ్యారు. గది బయట వ్యక్తిని చూసి షాకయ్యారు. వెంటనే 112కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. మంగళగిరి రూరల్ పోలీసులు వెంటనే అక్కడికి వచ్చారు. డిప్యూటీ తహశీల్దార్ సతీష్ ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. మహిళా డిప్యూటీ కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడిన డిప్యూటీ తహశీల్దార్ తన ప్రమోషన్ విషయంలో మాట్లాడేందుకే వచ్చినట్టు చెప్పడం విశేషం. ఇక్కడ ఏపీలో ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లో డిప్యూటీ కలెక్టర్ గది తలుపు తట్టిన సతీష్ మాత్రం పోలీసుల దగ్గర నోరు విప్పలేదని తెలుస్తోంది. ఈ విషయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. శిక్షణ సమయంలోనే ఇలాంటి తప్పు చేసి అరెస్ట్ అయిన డీటీపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మహిళా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.