మాజీ మంత్రి అయినా.. మా మాట వినాల్సిందే.. జవహర్‌పై పెత్తందార్ల గుస్సా
1983లో టీడీపీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఎవరున్నా కృష్ణబాబు సోదరుడు అచ్చిబాబుదే రాజ్యం. ఎస్సీ నియోజకవర్గమైనా ఆయన పట్టు వదల్లేదు.
పేదల పక్షాన నిలబడే తనకు, పెత్తందార్లకు మధ్య వచ్చే ఎన్నికల్లో పోటీ అని సీఎం జగన్ పదేపదే చెబుతున్నారు. అది నిజమని నిరూపించే సంఘటనలు ప్రతిపక్ష టీడీపీలో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. అధికారంలో లేకపోయినా వారి అహంకారం ఏ మాత్రం తగ్గలేదు. మాజీ మంత్రి కేఎస్ జవహర్‌పై ఆయన నియోజకవర్గంలోని టీడీపీ పెత్తందార్లు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.
5సార్లు గెలిచిన పెండ్యాల కృష్ణబాబు
ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి, జిల్లాల పునర్విభజన తర్వాత తూర్పుగోదావరిలోకి వెళ్లిన కొవ్వూరు నియోజకవర్గం గతంలో టీడీపీకి కంచుకోట. ఆంధ్రా షుగర్స్ అధినేత ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ మేనల్లుడు పెండ్యాల కృష్ణబాబు ఇక్కడి నుంచి 5సార్లు గెలిచారు. పునర్విభజనలో కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో కృష్ణబాబు తెరపై నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత టీడీపీ నుంచి టి.వి.రామారావు ఎమ్మెల్యే అయ్యారు. 2014 ఎన్నికల్లో కె.ఎస్.జవహర్ టీడీపీ నుంచి గెలిచి మంత్రి కూడా అయ్యారు.
ఎమ్మెల్యే ఎవరున్నా అచ్చిబాబుదే రాజ్యం
1983లో టీడీపీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఎవరున్నా కృష్ణబాబు సోదరుడు అచ్చిబాబుదే రాజ్యం. ఎస్సీ నియోజకవర్గమైనా ఆయన పట్టు వదల్లేదు. అచ్చిబాబు మాట వినడం లేదనే జవహర్‌ను గత ఎన్నికల్లో కొవ్వూరు నుంచి కృష్ణా జిల్లా తిరువూరుకు పంపారంటే అచ్చిబాబు పట్టు ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఓడిపోయి తిరిగి కొవ్వూరుకు వచ్చినా జవహర్ అచ్చిబాబు కనుసన్నల్లోనే ఉండాల్సి వస్తోంది. టీడీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా చంద్రబాబు జవహర్‌ను నియమించినా ఇక్కడ మాత్రం ఆయన అచ్చిబాబు మాట దాటడానికి వీల్లేని పరిస్థితి.
మా ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలేసే దమ్ము వచ్చిందా?
ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలవాలని పట్టుదలతో ఉన్న జవహర్ తన పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు వేయించారు. అయితే అచ్చిబాబు ఫొటో లేకుండా ఆయా గ్రామ పార్టీల పేరున ఫ్లెక్సీలు వేయడంతో అచ్చిబాబు వర్గం మండిపడుతోంది. అచ్చిబాబు స్వగ్రామమైన దొమ్మేరులో కూడా ఆయన ఫొటో లేకుండా దొమ్మేరు టీడీపీ అని ఫ్లెక్సీ వేయడంతో గ్రామంలోని పెత్తందార్లంతా మీటింగ్ పెట్టి మరీ జవహర్‌ను దులిపేశారు. అచ్చిబాబు చెబితేనే 2014 ఎన్నికల్లో జవహర్‌ను గెలిపించామని తెగేసి చెప్పేశారు. అంతటితో ఆగకుండా నియోజకవర్గ టీడీపీ ద్విసభ్య కమిటీకి జవహర్‌పై ఫిర్యాదు కూడా చేశారు. కొవ్వూరు నియోజకవర్గంలో ఆయన ప్రమేయం లేకుండా చేయాలని కోరారు. దీంతో అసలు జవహర్‌కు కొవ్వూరు టికెట్ ఇస్తారా, ఇచ్చినా ఈ పెత్తందార్లు ఆయన్ను గెలవనిస్తారా..? అని సగటు టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.