మనల్ని ఎవడ్రా ఆపేది..? రికార్డులు తిరగరాస్తున్న టమాటా
ప్రస్తుతానికి ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అంటున్నారు. టమాటా రేటు 250కి చేరుకుంటుందా లేదా అనేది చెప్పలేమని, అయితే ఇప్పట్లో మాత్రం ధర పడిపోయే అవకాశం లేదని చెబుతున్నారు వ్యాపారులు.
ఆమధ్య డబుల్ సెంచరీకి చేరువైన టమాటా రేటు ఆల్ టైమ్ రికార్డ్ అనుకున్నారంతా. పోనీ డబుల్ సెంచరీ కొట్టిన తర్వాతయినా టమాటా కాస్త విశ్రాంతి తీసుకుంటుందేమో అనే అంచనా వేశారు. కానీ టమాటా ఎక్కడా తగ్గేది లేదంటోంది, హోల్ సేల్ మార్కెట్ లోనే కేజీ 224 రూపాయలు పలుకుతోంది. అయితే ఇది నాణ్యమైన టమాటా. కేవలం దీన్ని ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. దక్షిణాదిలో మనకు మార్కెట్లో దొరికే టమాటా మూడు లేదా నాలుగో గ్రేడ్ రకం. దీని ధర కాస్త అటు ఇటుగా 200 రూపాయల దగ్గర్లో ఉంది.
అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని అంగళ్లు మార్కెట్ లో నాణ్యమైన టమాటా రికార్డు స్థాయిలో కిలో రూ.224 పలికింది. 25 కేజీల బరువుండే ఒక్కో క్రేటు 5600 రూపాయలకు అమ్ముడుపోయింది. దాదాపు 10వేల క్రేట్ల సరకుని నిమిషాల వ్యవధిలో వేలంలో కొనుగోలు చేశారు హోల్ సేల్ వ్యాపారులు. దాన్ని ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అని అంటున్నారు. టమాటా రేటు 250కి చేరుకుంటుందా లేదా అనేది చెప్పలేమని, అయితే ఇప్పట్లో మాత్రం ధర పడిపోయే అవకాశం లేదని చెబుతున్నారు వ్యాపారులు.
అనంతపురం జిల్లా కక్కలపల్లి టమాటా మార్కెట్ మండీలో 15 కిలోల బాక్స్ రూ.3,200కు అమ్ముడుపోయింది. దాదాపుగా కేజీ 215 రూపాయలకు చేరింది. ఇది రిటైల్ మార్కెట్లోకి వచ్చేసరికి మరింత ధర పెరుగుతుంది. ఇక ఆన్ లైన్ లో బిగ్ బాస్కెట్ సైట్ లో లోకల్ టమాటా కేజీ 155 రూపాయలు కాగా, హైబ్రిడ్ టమాటా 165 రూపాయలుగా ఉంది. ఇదంతా మూడు, లేదా నాలుగో గ్రేడ్ టమాటాగా చెప్పుకోవాలి. దాదాపుగా ఫస్ట్ గ్రేడ్ టమాటా మన మార్కెట్లలో అందుబాటులోకి రావడం లేదు. దీన్ని కేవలం ఉత్తరాదికి ఎగుమతి చేసేందుకే హోల్ సేల్ వ్యాపారులు ఆసక్తి చూపిస్తున్నారు.