మదనపల్లె మార్కెట్ లో భారీగా పడిపోయిన టమాటా ధరలు..
బుధవారం హోల్ సేల్ మార్కెట్ లో టమాటా రేటు కిలో రూ.100కి చేరడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ధర కొన్నిరోజులైనా నిలకడగా ఉంటుందని అంచనా వేశారు. కానీ గురువారం రేటు 50రూపాయలకు పడిపోవడం విశేషం.
టమాటా ధరలు దిగొస్తున్నాయి. అది కూడా ఊహించని రేంజ్ లో పడిపోతున్నాయి. పెరగడానికి సమయం కాస్త ఎక్కువపట్టినా, తగ్గడానికి ఆ గ్యాప్ కూడా లేదు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే టమాటా రేటు భారీగా పడిపోయింది. ప్రస్తుతం మదనపల్లె హోల్ సేల్ మార్కెట్ లో ఏ గ్రేడ్ టమాటా రేటు కిలో రూ.50 నుంచి రూ.64 మధ్యలో పలికింది. ఇదే ఏ గ్రేడ్ టమాటా జులై 30న అత్యధికంగా రూ.196 పలకడం విశేషం. రోజలు వ్యవధిలోనే నాలుగోవంతుకి పడిపోవడం రైతులను నిరాశకు గురిచేస్తోంది.
టమాటా రైతుల ఆనందం ఆవిరయ్యే రోజులు వచ్చేశాయి. టమాటా రేటు భారీగా పెరిగిన తర్వాత చాలామంది కొత్తగా తోటలు వేశారు. కానీ ఇప్పుడు చేతికి అందివచ్చిన పంటకు మాత్రం ఆ స్థాయిలో ధరలు లేవు. ఎంతోకొంత లాభం వచ్చినా, ఇకపై "టమాటా రైతులు లక్షలు వెనకేశారు, కోట్లు సంపాదించారు" అనే మాటలు మాత్రం వినపడవు. దిగుబడి పెరగడం, వర్షాలు తగ్గి రవాణా సౌకర్యాలు పెరగడంతో హోల్ సేల్ మార్కెట్లలో టమాటా రేట్లు భారీగా పడిపోయాయి.
రెండు రోజుల్లో హాం ఫట్..
బుధవారం హోల్ సేల్ మార్కెట్ లో టమాటా రేటు కిలో రూ.100కి చేరడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ధర కొన్నిరోజులైనా నిలకడగా ఉంటుందని అంచనా వేశారు. కానీ గురువారం రేటు 50రూపాయలకు పడిపోవడం మరింత ఆందోళనకు కారణం అవుతోంది. ఏ గ్రేడ్ టమాటా కిలో రూ.50 నుంచి రూ.64 వరకు, బీ గ్రేడ్ రూ.36 నుంచి రూ.48 వరకు ఉంది. రాబోయే రోజుల్లో రేట్లు మరింతగా పడిపోతాయని చెబుతున్నారు మార్కెటింగ్ శాఖ అధికారులు.