Telugu Global
Andhra Pradesh

టమోటా రైతుల అష్టకష్టాలు.. పంటంతా రోడ్లపాలు

ఈరోజు నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని హోల్ సేల్ మార్కెట్లలో 25కేజీల టమాటా బాక్స్ కేవలం 10రూపాయలు పలికింది. అంటే కేజీ 40పైసలు అన్నమాట. అంత తక్కువ ధరకు టమోటాలు అమ్మడం ఇష్టం లేని రైతులు వాటిని రోడ్లపై పారబోసి వెళ్లారు.

టమోటా రైతుల అష్టకష్టాలు.. పంటంతా రోడ్లపాలు
X

నిన్న మొన్నటి వరకు టమోటా రైతులంత అదృష్టవంతులు లేరు అనుకున్నారంతా. నిజంగానే టమోటా రైతులు లాభాల పంట పండించుకున్నారు. అప్పులు తీర్చేసి, కాస్తో కూస్తో వెనకేసుకున్నారు. కానీ అదే రైతు నేడు పంటకు రేటులేక అల్లాడిపోతున్నాడు. గిట్టుబాటు ధర లేకపోవడంతో పండిన పంటంతా రోడ్డున పడేస్తున్నాడు. మూగజీవాలకు మేతగా వేస్తున్నాడు. ఎందుకీ పరిస్థితి..?

ఆమధ్య పంట కొరత, వర్షాల కారణంగా డిమాండ్ పెరిగి సప్లై తగ్గడంతో టమోటా రేటు భారీగా పెరిగింది. కొన్నిచోట్ల కేజీ 250 రూపాయల ధర కూడా పలికింది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఆల్ టైమ్ రికార్డ్ ని నమోదు చేసింది. దాదాపు రెండున్నర నెలలపాటు టమోటా రైతు రాజయ్యాడు. అదే రైతు నేడు గిట్టుబాటు ధర లేక దిగాలుపడ్డాడు. ఈరోజు నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని హోల్ సేల్ మార్కెట్లలో 25కేజీల టమాటా బాక్స్ కేవలం 10రూపాయలు పలికింది. అంటే కేజీ 40పైసలు అన్నమాట. అంత తక్కువ ధరకు టమోటాలు అమ్మడం ఇష్టం లేని రైతులు వాటిని రోడ్లపై పారబోసి వెళ్లారు.


ఎందుకీ అవస్థ..

నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్, కర్నూలు జిల్లాలోని పత్తికొండ వ్యవసాయ మార్కెట్లలో టమాటా ధరలు పూర్తిగా పతనమయ్యాయి. 25 కేజీల బాక్స్ రేటు 10 రూపాయల నుంచి 35 రూపాయల వరకు పలికింది. పలు ప్రాంతాల్లో టన్నులకొద్దీ దిగుబడి రావడం, ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు రాకపోవడంతో.. టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. దాంతో రైతులకు కనీసం కూలీలు కూడా గిట్టుబాటు కావడంలేదు. రేటు భారీగా పెరిగిన సమయంలో చాలామంది రైతులు టమోటా సాగుకి ఆసక్తి చూపించారు. దీంతో సహజంగానే సప్లై భారీగా పెరిగింది. వివిధ ప్రాంతాలనుంచి టమోటాలు మార్కెట్ కి వస్తున్నాయి. లోకల్ గా కూడా పంట లభ్యత ఎక్కువ కావడంతో డిమాండ్ తగ్గింది, అందుకే రేట్లు పడిపోయాయి.

First Published:  7 Sept 2023 5:43 PM IST
Next Story