Telugu Global
Andhra Pradesh

టమాటా రైతు మంచి మనసు.. ఏం చేశాడో తెలుసా..?

లాభాలొస్తే మిగతావాళ్లు ఎలా స్పందిస్తారో తెలియదు కానీ, అన్నదాతలు మాత్రం తమ సంతోషాన్ని మిగతావారితో పంచుకుంటారని నిరూపించాడు అన్నమయ్య జిల్లా రైతు.

టమాటా రైతు మంచి మనసు.. ఏం చేశాడో తెలుసా..?
X

టమాటా రేట్లు చాలాసార్లు పెరిగాయి కానీ, రైతులు విపరీతంగా లాభాలు కళ్లజూడటం మాత్రం ఇదే తొలిసారి. రైతులు ఏకంగా కోటీశ్వరులవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరీ కోట్లు కాకపోయినా.. చిన్న చిన్న కమతాల్లో టమాటా సాగు చేసిన రైతులు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. గతంలో టమాటా పంటతో నష్టపోయిన రైతులు ఈ లాభాలతో కాస్త కుదుటపడ్డారు. లాభాలొస్తే మిగతావాళ్లు ఎలా స్పందిస్తారో తెలియదు కానీ, అన్నదాతలు మాత్రం తమ సంతోషాన్ని మిగతావారితో పంచుకుంటారని నిరూపించాడు అన్నమయ్య జిల్లా రైతు. తన పొలంలో పనిచేసిన కూలీలకు డబ్బులివ్వడంతోపాటు బట్టలుపెట్టి ఆప్యాయత పంచాడు.

టమాటా రేటు పడిపోయిన సందర్భాల్లో రైతులు, కూలీలకు కూడా డబ్బులివ్వలేని పరిస్థితులు నెలకొంటాయి. పొలంలో చెట్లకే కాయల్ని వదిలేస్తారు, కొంతమంది కూలీ డబ్బులిచ్చి కాయలు కోయించినా ధర లేకపోతే రోడ్లపైనే పారబోస్తారు. కానీ ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. ఒక్క టమాటా కూడా వృథా కాకుండా రేటు పలుకుతోంది. దీంతో టమాటా పండించిన రైతులంతా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని వారు కూలీలతో కూడా కలసి పంచుకుంటున్నారు.

ఏపీలోని అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలంలో రైతు నరసింహా రెడ్డి ఐదెకరాల పొలంలో టమాటా సాగు చేశాడు. అధిక ధరలతో లాభాలు రావడంతో ఆనంద పడ్డ రైతు.. తన పొలంలో టమాట సాగులో భాగస్వాములైన కూలీలకు కొత్త బట్టలు పెట్టి మంచి మనసు చాటుకున్నాడు. మహిళలకు చీరలు, పురుషులకు కొత్త బట్టలు పెట్టి.. వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రమ విలువ తెలిసిన అన్నదాత, పొలంలో కష్టపడిన కూలీలకు బట్టలు పెట్టడాన్ని అందరూ అభినందిస్తున్నారు.

First Published:  28 July 2023 11:53 AM GMT
Next Story