టమాటా ఆల్ టైమ్ రికార్డ్.. ఇప్పుడు రేటెంతంటే..?
టమాటా గ్రేడ్ ని బట్టి రేటుని డిసైడ్ చేస్తున్నారు. ఫస్ట్ క్వాలిటీ రేటు కిలో 160నుంచి 196 రూపాయలుగా ఉంది. రెండో రకం రేటు కిలో 120నుంచి 156రూపాయల మధ్యలో ఉంది.
టమాటా రేట్లలో హెచ్చు తగ్గుల్ని చాలాకాలంగా చూస్తున్నాం. కానీ ఇన్నిరోజులు టమాటా రేట్లు పెరిగే ఉండటం మాత్రం ఇటీవల కాలంలో ఎవరికీ అనుభవంలో లేని విషయం. అలా పెరిగిన రేట్లు తగ్గకపోగా మరింత పైపైకి ఎగబాకుతున్నాయి. ఏకంగా డబుల్ సెంచరీకి చేరువయ్యాయి. మదనపల్లిలోని హోల్ సేల్ మార్కెట్ లో నాణ్యమైన టమాటా రేటు 196 రూపాయలకు చేరుకోవడం ఆల్ టైమ్ రికార్డ్ అని అంటున్నారు. గతంలో టమాటా హోల్ సేల్ రేటు ఎప్పుడూ 196 రూపాయలు లేదు. ఇక రిటైల్ వ్యాపారుల వద్దకు వచ్చేసరికి ఈ రేటు మరింత పెరగడం ఖాయం.
టమాటా గ్రేడ్ ని బట్టి రేటుని డిసైడ్ చేస్తున్నారు. ఫస్ట్ క్వాలిటీ రేటు కిలో 160నుంచి 196 రూపాయలుగా ఉంది. రెండో రకం రేటు కిలో 120నుంచి 156రూపాయల మధ్యలో ఉంది. మార్కెట్ కి సరుకు ఎక్కువగా వస్తే రేటు విషయంలో హోల్ సేల్ వ్యాపారులు రైతుల వద్ద బేరాలాడుతున్నారు. సరుకు తక్కువగా వస్తే రేటు పెంచి తీసేసుకుంటున్నారు. ప్రస్తుతం టమాటా పంట దిగుబడి లేదు, వర్షాలతో రవాణా కూడా తగ్గిపోయింది. దీంతో మదనపల్లిలోని మార్కెట్ కి శనివారం కేవలం 253 టన్నుల టమాటా మాత్రమే వచ్చింది. దీంతో రేటు భారీగా పెరిగిపోయింది.
నమ్మినవారికి న్యాయం చేసిన టమాటా..
టమాటా రైతులు గతంలో చాలాసార్లు నష్టాల్లో మునిగిపోయారు. అయినా కూడా వారు సాగుని వదిలిపెట్టలేదు. ఎప్పటికైనా టమాటా వల్లే తాము బాగుపడతామనే నమ్మకంతో కొందరు అదే పంటని సాగుచేస్తూ వచ్చారు. అలా నమ్మకం పెట్టుకున్నవారందర్నీ కోటీశ్వరుల్ని చేసింది టమాటా. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ రైతు కేవలం 45రోజుల్లోనే టమాటాల అమ్మకం ద్వారా 4కోట్ల రూపాయల ఆదాయం కళ్లజూశారు. గతేడాది ఇదే సమయానికి టమాటాల వల్లే కోటిన్నర రూపాయల మేర అప్పులపాలైన ఆ రైతు, ఈ ఏడాది అప్పులు తీర్చుకోవడం విశేషం.