పవన్ పై మైండ్ గేమేనా..?
పవన్ తనను తాను జగన్మోహన్ రెడ్డికి మించిన నేతగా ఫీలవుతుంటారు. ఈ విషయాన్ని స్వయంగా పవనే చాలాసార్లు చెప్పారు. అందుకనే ఇప్పుడు ఆలీతో పవన్ పై వ్యాఖ్యలు చేయించింది.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై వైసీపీ మైండ్ గేమ్ మొదలుపెట్టింది. అదికూడా సినిమాల్లో పాపులరైన పవర్ స్టార్ పై కమేడియన్ ఆలీని ప్రయోగించింది. పవన్ పై పోటీకి తాను రెడీగా ఉన్నట్లు ఆలీ చేసిన ప్రకటన ఇందులో భాగమే. పవన్ ఎక్కడ పోటీచేసినా అధిష్టానం ఆదేశిస్తే తాను పోటీచేయటానికి రెడీగా ఉన్నట్లు ఆలీ చెప్పారు. ఇక్కడ అధిష్టానం ఆదేశిస్తే అనేది ట్యాగ్ లైన్.
పైగా రాజకీయాల్లో పవన్ కు పరిణతి లేదని ఆలీ సర్టిఫై చేయటమే ఇక్కడ అసలైన మైండ్ గేమ్. పోయిన ఎన్నికల్లో పోటీచేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో ఓడిపోయారని పవన్‌ను ఎద్దేవా చేశారు. పవన్‌ను జగన్మోహన్ రెడ్డి లేకపోతే మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాద్, రోజా, మాజీ మంత్రులు పేర్నినాని, కొడాలి నాని లాంటి వాళ్ళు కౌంటర్లు చేయటం వృథా అనుకున్నట్లున్నారు. ఇప్పటికే పవన్‌ను ఉద్దేశించి మంత్రులు మాట్లాడినపుడల్లా సినిమాల్లో హీరో అయితే అయ్యుండచ్చు కానీ రాజకీయాల్లో మాత్రం జోకరే అని పదే పదే ఎద్దేవా చేస్తున్నారు.
ఇందులో భాగంగానే అన్నట్లుగా ఇప్పుడు కమేడియన్‌ను రంగంలోకి దింపారు. నిజానికి పవన్-ఆలీ ఇద్దరూ చాలాసన్నిహిత మిత్రులన్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఒకరిని మరొకరు ఇప్పటివరకు విమర్శించుకోలేదు. అయితే రాజకీయాల్లో ఇలా మిత్రులుగా ఉండటం కష్టమే. అందుకనే ఇప్పుడు పవన్ పై ఆలీ నోరిప్పారు. అదికూడా డైరెక్టుగా పవన్ పరిణతి లేని రాజకీయ నేతగా అభివర్ణించటమే ఆశ్చర్యంగా ఉంది.
పవన్ పై ఆలీతో వ్యాఖ్యలు చేయించటంలో ఉద్దేశ్యం ఏమిటంటే.. పవన్ తనను తాను జగన్మోహన్ రెడ్డికి మించిన నేతగా ఫీలవుతుంటారు. ఈ విషయాన్ని స్వయంగా పవనే చాలాసార్లు చెప్పారు. అందుకనే ఇప్పుడు ఆలీతో పవన్ పై వ్యాఖ్యలు చేయించింది. పవన్ లాగే ఆలీ కూడా పెద్ద సీరియస్ పొలిటీషియన్ ఏమీకాడు. అయినా పవన్ పై కామెంట్లు చేయటంలోనే రెచ్చగొట్టే వ్యూహం ఉన్నట్లు అర్ధమవుతోంది.