బటన్ నొక్కడానికి నేడు జగన్ రెడీ.. లబ్ధిదారులు ఎవరంటే..?
పెద్ద పెద్ద మొత్తాలయితే ఏదో ఒక జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టి హడావిడి చేస్తారు. లబ్ధిదారుల సంఖ్య తక్కువగా ఉంటే.. క్యాంప్ కార్యాలయంలోనే పని పూర్తి చేస్తారు. ఈరోజు సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి ఆర్థిక సాయం విడుదల చేయబోతున్నారు.
గతంలో బటన్ నొక్కే సీఎం అంటూ టీడీపీ కామెంట్ చేసేది. ఆ తర్వాత నేరుగా జగనే.. తాను బటన్ నొక్కి ప్రజలకు ఆర్థిక సాయం చేస్తున్నానంటూ పాజిటివ్ కోణంలో చెప్పుకోవడం మొదలు పెట్టారు. నా పని బటన్ నొక్కడం, మీ పని జనాల్లోకి వెళ్లడం అంటూ ఎమ్మెల్యేలకు ఉపదేశమిచ్చారు. మొత్తానికి బటన్ నొక్కడం, లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమకావడం.. ఏపీలో ఇది ఓ నిరంతర ప్రక్రియగా మారిపోయింది. నెలలో రెండు మూడు సార్లు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద మొత్తాలయితే ఏదో ఒక జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టి హడావిడి చేస్తారు. లబ్ధిదారుల సంఖ్య తక్కువగా ఉంటే.. క్యాంప్ కార్యాలయంలోనే పని పూర్తి చేస్తారు. ఈరోజు సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి ఆర్థిక సాయం విడుదల చేయబోతున్నారు.
కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలకు సంబంధించి ఈరోజు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు సీఎం జగన్. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి నెల మధ్య కాలంలో పెళ్లి చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు రూ.87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని అందిస్తారు. గత ఆరు నెలల్లోనే ఈ రెండు పథకాల కింద 16,668 మంది లబ్ధిదారులకు మేలు జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. వీరి ఖాతాల్లో మొత్తం రూ.125.50 కోట్లు జమ చేశామంటున్నారు అధికారులు.
పిల్లలు కాదు, తల్లులకే సాయం..
టీడీపీ హయాంలో పెళ్లి కూతురికి నేరుగా ఆర్థిక సాయం అందించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా తొలివిడత పెళ్లి కూతుళ్ల అకౌంట్లలోనే నగదు జమ చేసేవారు. కానీ, ఈసారి మాత్రం ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. పెళ్లికూతురు తల్లి ఖాతాలో నగదు జమ చేస్తామని ప్రకటించింది.
10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి..
ఈ పథకంలో పెళ్లి కూతురు కచ్చితంగా పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన పెట్టడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోందని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. పెళ్లయ్యే నాటికి అమ్మాయి పదో తరగతి పాస్ కాలేకపోతే ఈ పథకం కింద ఆర్థిక సాయం అందుకోడానికి వారు అనర్హులు. వధూవరులు వివాహమైన 30 రోజుల్లోపు తమ దగ్గరలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత అధికారులు క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించి వారి లిస్ట్ రెడీ చేస్తారు. మూడు నెలలకోసారి అంటే.. ప్రతి ఏడాదీ ఫిబ్రవరి, మే, ఆగస్టు, నవంబర్ నెలలలో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణమస్తు, షాదీ తోఫా సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది.