Telugu Global
Andhra Pradesh

తిరుపతి తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌ గ్రేషియా

ఘటనకు కారణం తొందరపాటు చర్యనా? సమన్వయ లోపమా? అనేది విచారణలో వెళ్లడవుతుందన్న రెవెన్యూ మంత్రి

తిరుపతి తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌ గ్రేషియా
X

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతుల కుటుంబసభ్యులను మంత్రులు అనగాని, అనిత, పార్థసారథి, ఆనం రామరానారయణ రెడ్డి పరామర్శించారు. స్విమ్స్‌ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించి డాక్టర్లతో మాట్లాడారు. అనంతరం అనగాని మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలో ఈ ఘటన జరగడం దురదృష్టకరం అన్నారు. ఘటనకు కారణం తొందరపాటు చర్యనా? సమన్వయ లోపమా? అనేది విచారణలో వెళ్లడవుతుందన్నారు.

హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. తిరుపతి ఘటన ప్రమాదామా.. కుట్రా? అనే కోణంలో విచారణ జరగుతున్నదన్నారు. ఎవరి వైఫల్యం ఉన్నది అనేది సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందన్నారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూస్తామన్నారు.

వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలోనే ఈ ఘటన జరగడం దురదృష్టకరమని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఘటనకు కారణం తొందరపాటు చర్యా, సమన్వయ లోపమా? అనేది విచారణలో వెల్లడవుతుందన్నారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పపంపుతామన్నారు. అంత్యక్రియలకు సహకారం అందించాలని ఆయా జిల్లా కలెక్టర్లకు రెవెన్యూ మంత్రి అనగాని ఆదేశాలు ఇచ్చారని చెప్పారు.

టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట జరిగిందని కలెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. గాయపడిన వారికి స్విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో వారు కూడా డిశ్చార్జి అవుతారని చెప్పారు. మృతదేహాలకు సత్వరమే పోస్టమార్టం నిర్వహించి వారి స్వస్థాలకు పంపుతామన్నారు. సీఎం చంద్రబాబు బాధితులను పరామర్శిస్తారని కలెక్టర్‌ వివరించారు.

First Published:  9 Jan 2025 12:28 PM IST
Next Story