పవన్‌ను లైట్‌గా తీసుకున్నారా?
పార్టీ నేత సాయిపై చేయి చేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ కథ చూస్తానని ప్రకటించిన పవన్ చివరకు తిరుపతిలో ఎస్పీని కలిసి యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేసి ఢిల్లీకి వెళ్ళిపోయారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి చాలా లైట్‌గా తీసుకున్నట్లు అనిపిస్తోంది. శ్రీకాళహస్తి పార్టీ నేత కొట్టె సాయిని సీఐ అంజూ యాదవ్ చెంపమీద కొట్టారు. అయితే ఆ విషయం సోషల్ మీడియాలో రాగానే పవన్ చాలా తీవ్రంగా స్పందించారు. వారాహి యాత్రలో తణుకులో పవన్ మాట్లాడుతూ.. సీఐ కథేంటో చూస్తానని ప్రకటించారు. పదేపదే అంజూ యాదవ్‌ను టార్గెట్ చేయటంతో విషయం కాస్త సంచలనమైంది.
శ్రీకాళహిస్తికి వెళ్ళి సీఐ కథేంటో తేల్చేస్తానని భీకరంగా గర్జించిన పవన్ చివరకు తిరుపతకి వెళ్ళి ఎస్పీని కలిశారు. దాంతో విషయంలో పసలేకుండా పోయింది. శ్రీకాళహస్తికి వెళ్ళి సాయిని పరామర్శించి నేతలు, కార్యకర్తలతో కలిసి పవన్ పెద్ద నిరసన చేయబోతున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. తీరా చూస్తే విషయం తుస్సుమన్నది. శ్రీకాళహస్తికి వెళ్ళి సీఐ కథ చూస్తానని ప్రకటించిన పవన్ చివరకు తిరుపతిలో ఎస్పీని కలిసి యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేసి ఢిల్లీకి వెళ్ళిపోయారు.
ఇక్కడే పవన్ చీప్ అయిపోయారు. ఎందుకంటే వారాహి యాత్రలో చెప్పింది ఒకటి చివరకు చేసింది ఇంకొకటి. బహుశా పవన్ కూడా తాను ఫిర్యాదు చేయగానే సీఐపై ప్రభుత్వం యాక్షన్ తీసేసుకుంటుందని అనుకున్నట్లు లేదు. ఈ విషయం గ్రహించే ఎస్పీ కూడా చాలా లైట్ తీసుకున్నట్లున్నారు. పవన్ వెళిపోయిన తర్వాత మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ.. జరిగిన ఘటనపై విచారణ కమిటీని వేస్తామన్నారు. విచారణ కమిటీ అంటేనే చివరకు ఏమవుతుందో అందరికీ తెలిసిందే. పైగా సాయిని సీఐ కొట్టడంలో ఎలాంటి రాజకీయం లేదని ఎస్పీనే తేల్చేశారు.
ఎందుకంటే సాయిని కొట్టే వరకు సీఐ-సాయి మధ్య అసలు పరిచయం కూడా లేదన్నారు. పరిచయం కూడా లేని వ్యక్తుల మధ్య వివాదంలో రాజకీయం ఎలా ఉంటుందని ఎస్పీ లాజిక్ మాట్లాడారు. దిష్టిబొమ్మను తగలబెట్టేటప్పుడు జరిగిన వివాదంలో సాయిపై సీఐ చేయి చేసుకున్నారంతే అని వివరించారు. సాయిని సీఐ చెంపదెబ్బకొట్టే వీడియో ఆధారంగా సీఐ, సాయి ఇద్దరినీ విచారిస్తామని ఎస్పీ చెప్పారు. విచారణ కమిటీ రిపోర్టు తర్వాతే సీఐపై చర్యలు తీసుకునే విషయాన్ని ఆలోచిస్తామని తేల్చేశారు. దీన్నిబట్టే పవన్‌ను ఎస్పీ ఎంత లైట్ తీసుకున్నారో అర్థమైపోతోంది.