బర్డ్ ఆసుపత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ తొలి సర్జరీ విజయవంతం
అనకాపల్లి జిల్లాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సూర్యకు బర్డ్ ఆసుపత్రిలో మొదటి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ విజయవంతంగా చేసిన నేపథ్యంలో.. సోమవారం సాయంత్రం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఎ వి ధర్మారెడ్డి, జెఈవో సదా భార్గవితో కలసి మీడియాతో మాట్లాడారు.
అనకాపల్లి జిల్లాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సూర్యకు బర్డ్ ఆసుపత్రిలో మొదటి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ విజయవంతంగా చేసిన నేపథ్యంలో.. సోమవారం సాయంత్రం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఎ వి ధర్మారెడ్డి, జెఈవో సదా భార్గవితో కలసి మీడియాతో మాట్లాడారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు గ్రామానికి చెందిన సత్యనారాయణ రాజు వ్యవసాయ దారుడు. ఆయన చిన్న కూతురు సూర్య బిటెక్ చదివి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ గా ఉద్యోగం చేసేవారు. 2020 లో కోవిడ్ వల్ల ఇంటినుండి పనిచేసేందుకు తన గ్రామానికి వచ్చారు. జులై 20 వ తేదీ ఎటియం కు వెళ్ళి జీతం డ్రా చేసుకుని వస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి ఆమెను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఆమెకు చెవిలో నుంచి రక్తం కారి చెవులు వినిపించకుండా పోయాయి. దీని కారణంగా ఆమె మాట్లాడలేక పోయింది.
విశాఖపట్నం లోని ప్రైవేటు ఆసుపత్రిలో సర్జరీ చేయించినా ఉపయోగం లేక పోయింది. హైదరాబాద్ లోని మరో ప్రైవేటు ఆసుపత్రిలో రెండవ సర్జరీ చేయించినా ప్రయోజనం కనిపించలేదు. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తే ఉపయోగం ఉంటుందని, ఇందుకు రూ.10 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. అంత ఖర్చు భరించే శక్తి లేకపోవడంతో సత్యనారాయణ రాజు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ని కలసి తమ బిడ్డకు వైద్యం చేయించడానికి సహాయం చేయాలని అభ్యర్థించారు.
దీనిపై స్పందించిన సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కి విషయం వివరించారు. దీనిపై వెంటనే స్పందించిన వైఎస్ జగన్.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సూర్య ఆపరేషన్ కు రూ 10 లక్షలు మంజూరు చేశారు.
సాంకేతిక కారణాల వల్ల ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం ఈ ఆపరేషన్ చేయలేక పోయింది. దీంతో ఏడాదిన్నర నుంచి ఇంటి వద్దే ఫిజియో థెరఫీ చేయిస్తున్న సత్యనారాయణ రాజు కు బర్డ్ ఆసుపత్రిలో ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేస్తున్న విషయం తెలిసి ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్ప రెడ్డి ని సంప్రదించారు.
గతంలో సి ఎం, టీటీడీ చైర్మన్ తమకు చేసిన సహాయం గురించి తెలియజేశారు. దీంతో సెప్టెంబర్ 20వ తేదీ సూర్య ను అడ్మిట్ చేసుకుని 22వ తేదీ సర్జరీ చేయించారు. సర్జరీ విజయవంతం కావడంతో సోమవారం సాయంత్రం టీటీడీ చైర్మన్, ఈవో సమక్షంలో ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్ప రెడ్డి సూర్యను డిశ్చార్జ్ చేశారు. మరో పది రోజుల్లో సూర్య వినగలగడం, మాట్లాడటం చేయగలదని డాక్టర్లు చెప్పారు.
రూపాయి ఖర్చు కాకుండా తమబిడ్డకు వైద్యం అందించిన శ్రీ వేంకటేశ్వర స్వామి కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి సూర్య తండ్రి సత్యనారాయణ రాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసులో విచిత్రం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం రూ 10 లక్షలు ఇవ్వడానికి ముందుకు వచ్చినా సాంకేతిక కారణాల వల్ల సర్జరీ చేయలేమని చెప్పిన ఆసుపత్రి వైద్యులే బర్డ్ ఆసుపత్రికి వచ్చి ఉచితంగా సర్జరీ చేశారు.
బర్డ్ ఆస్పత్రిలో ఇకపై పూర్తిస్థాయిలో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు
పేదలకు ఉచితంగా అనేక ఆరోగ్య సేవలు, శస్త్ర చికిత్సలు అందిస్తున్న బర్డ్ ఆసుపత్రిలో రాబోయే రోజుల్లో కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్సలు పూర్తి స్థాయిలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ..
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రజల కోసం అనేక రకాల వైద్య సేవలు అందిస్తున్నాయని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా చెవుడు , మూగ వారిగా పుట్టే వారికి ఆ లోపాలు తొలగించి సాధారణ మనుషులుగా మార్చడానికి టీటీడీ నిర్ణయం తీసుకుందన్నారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాది మే 5వ తేదీ ఇలాంటి వారి కోసం బర్డ్ ఆసుపత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ విభాగాన్ని ప్రారంభించారని చైర్మన్ గుర్తు చేశారు. చెవుడు, మూగ వారిగా పుట్టే వారు ఈ శస్త్రచికిత్సల వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారని ఆయన తెలిపారు. ఐదేళ్ళ లోపు పిల్లలకు ఈ శస్త్రచికిత్స వల్ల 100 శాతం ఫలితాలు ఉంటాయని చైర్మన్ తెలిపారు. రూ 10 లక్షల ఖర్చయ్యే ఈ ఆపరేషన్లు టీటీడీ పూర్తి ఉచితంగా నిర్వహిస్తోందని ఆయన వివరించారు.
స్మైల్ ట్రైన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బర్డ్ హాస్పిటల్‌లో గ్రహణమొర్రి సర్జరీలు కూడా ప్రారంభించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బెంగుళూరుకు చెందిన ప్రముఖ సర్జన్ డాక్టర్ కృష్ణమూర్తి , బర్డ్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఝాన్సీ బృందం సెప్టెంబరు 13వ తేదీ ఐదుగురు చిన్నారులకు విజయవంతంగా శస్త్ర చికిత్సలు చేసి వారికి కొత్త జీవితం ప్రసాదించారని అభినందించారు. ఒక్క రూపాయ ఖర్చు లేకుండా ఆపరేషన్ చేయడంతో పాటు తిరిగి వారి ఇళ్ళకు చేరుకోవడానికి బస్సు చార్జీలు కూడా ఇచ్చి పంపడం జరుగుతోందన్నారు.
నెలకు 100 మందికి ఈ ఆపరేషన్లు చేయాలని బర్డ్ వైద్యులు లక్ష్యంగా పెట్టుకుని ఇందుకు అవసరమైన సదుపాయాలూ సిద్ధం చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఏ వయసు వారికైనా ఈ ఆపరేషన్లు చేయడం జరుగుతుందన్నారు. అపోలో ఆసుపత్రికి చెందిన డాక్టర్ ఈసి వినయ్ కుమార్ ఆధ్వర్యంలోని బృందం సెప్టెంబరు 22వ తేదీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సూర్యకు మొదటి శస్త్రచికిత్స విజయవంతంగా చేశారని చైర్మన్ వివరించారు.