టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలనేది ప్రధాన నిర్ణయం కావడం గమనార్హం. 114 జీవో ప్రకారం ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందిని రెగులరైజ్ చేస్తామని చైర్మన్ భూమన ప్రకటించారు.
తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం సమావేశమైన టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలపై చర్చించి వాటి అమలుకు ఆమోదం తెలిపింది. చైర్మన్ భూమన విలేకరులకు ఆ వివరాలు వెల్లడించారు. ఇందులో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలనేది ప్రధాన నిర్ణయం కావడం గమనార్హం. 114 జీవో ప్రకారం ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందిని రెగులరైజ్ చేస్తామని చైర్మన్ భూమన ప్రకటించారు.
దీంతో పాటు పాలకమండలి నిర్ణయాల్లో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 23 నుంచి అలిపిరి గోశాల శ్రీనివాస హోమం ప్రారంభించనున్నారు. టీటీడీ ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వనున్నారు. అందుకోసం మరిన్ని ఎకరాలు సేకరిస్తున్నారు. ఉద్యోగులకు ఇంటి స్థలం కేటాయించే ప్రాంతాలలో రూ.27.65 లక్షలతో గ్రావెల్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. మరో రూ.15 కోట్లతో అదనపు రోడ్డు నిర్మించనున్నారు.
తిరుమల ఆరోగ్య విభాగంలో 650 మంది ఉద్యోగులను మరో ఏడాది పొడిగించనున్నారు. ఇందుకోసం రూ.3.40 లక్షలు కేటాయించారు. మంగళం ఆర్టీవో కార్యాలయం నుంచి తిరుచానూరు రోడ్డు అభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయించారు. రేణిగుంట రోడ్డు నుంచి తిరుచానూరు వరకు రూ.3.11 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. తిరుపతి పద్మావతి చిన్న పిల్లల ఆస్పత్రిలో నూతన టిబీ వార్డు నిర్మాణానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. స్విమ్స్ ఆస్పత్రి భవనం ఆధునికీకరణకు రూ.197 కోట్లు కేటాయించారు. కరీంనగర్‌లో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. సంప్రదాయ కళల అభివృద్ధికి టీటీడీ ఆధ్వర్యంలో ప్రాథమిక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. కలంకారీ, శిల్పకళా శిక్షణ కూడా ఇవ్వడానికి ఆమోదం తెలిపారు.