Telugu Global
Andhra Pradesh

ఘాట్ రోడ్ లో చిరుత ఫ్యామిలీ.. ట్రాప్ కెమెరాల్లో క్లియర్ ఫొటోలు

చిరుతలను బంధించేందుకు మరిన్ని బోనుల్ని తెప్పించారు అధికారులు. తాజాగా టీటీడీ విడుదల చేసిన ట్రాప్ కెమెరాల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భక్తుల్లో భయం మరింతగా పెరిగింది.

ఘాట్ రోడ్ లో చిరుత ఫ్యామిలీ.. ట్రాప్ కెమెరాల్లో క్లియర్ ఫొటోలు
X

గతంలో ఓ చిరుతను బంధించి వదిలిపెట్టారు, ఈ నెలలో రెండు చిరుతల్ని బంధించి జూ పార్క్ కి తరలించారు. కొత్తగా ఇప్పుడు మరో చిరుత ట్రాప్ కెమెరాలకు చిక్కింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఎలిఫెంట్ ఆర్చ్ వద్ద ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు రికార్డు అయ్యాయి. తిరుమలలోని స్పెషల్ టైప్ కాటేజీల దగ్గర ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో ఎలుగుబంటి సంచరించే దృశ్యాలు కూడా ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

ఎన్ని చిరుతలు..?

తిరుమలలో చిరుత పులులు అధికారుల అంచనాలకు మించే ఉన్నాయని తెలుస్తోంది. అయితే అవి ఇప్పుడు ఘాట్ రోడ్ ల వైపు రావడంతో కలకలం రేగింది. గతంలో బోనులో బంధించి విడుదల చేసిన చిరుత జాడ ఇప్పటి వరకు లేదు. ఇటీవల బోనుల్లో పడిన రెండు చిరుతలు వేరు, ఇప్పుడు ట్రాప్ కెమెరాకు చిక్కిన చిరుత కూడా వేరు. అంటే రెండు నెలల వ్యవధిలోనే నాలుగు చిరుతలు కనపడ్డాయి. చిరుత ఫ్యామిలీలో ఇంకా ఎవరెవరున్నారనేది తేలాల్సి ఉంది.



హడలిపోతున్న భక్తులు..

తిరుమల కొండపై కూడా రాత్రుళ్లు జనసంచారం పూర్తిగా తగ్గిపోయింది. దర్శనాలకోసం వెళ్లే భక్తులు, దర్శనం చేసుకుని తిరిగి వచ్చేవారు కూడా భయం భయంగా రోడ్లపై తిరుగుతున్నారు. స్పెషల్ కాటేజీల దగ్గర ఎలుగుబంటి సంచారం ఈ భయాలను మరింత పెంచింది.



చిరుతలను బంధించేందుకు మరిన్ని బోనుల్ని తెప్పించారు అధికారులు. ట్రాప్ కెమెరాల్లో చిరుత జాడ కనపడిన ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఆపరేషన్ చిరుత పేరుతో అధికారులు మరింత అప్రమత్తత ప్రకటించారు. తాజాగా టీటీడీ విడుదల చేసిన ట్రాప్ కెమెరాల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భక్తుల్లో భయం మరింతగా పెరిగింది.

First Published:  19 Aug 2023 12:03 PM IST
Next Story