Telugu Global
Andhra Pradesh

తిరుమల ఘాట్ రోడ్ లో మళ్లీ ప్రమాదం.. ఈసారి ఏమైందంటే..?

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్ లో ముందు వెళ్తున్న బస్సుని ఓవర్ టేక్ చేయబోయిన టెంపో వాహనం కొండను ఢీకొట్టి ఆగిపోయింది. 10వ కిలోమీటర్ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.

తిరుమల ఘాట్ రోడ్ లో మళ్లీ ప్రమాదం.. ఈసారి ఏమైందంటే..?
X

తిరుమల ఘాట్ రోడ్ వరుస ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇటీవల ఒకదానిక వెంట ఒకటి వరుసగా ప్రమాదాలు ఘాట్ రోడ్ లోనే జరుగుతున్నాయి. గత వారం ఓ ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడగా ప్రయాణికులకు గాయాలయ్యాయి, ఈరోజు ఉదయాన్నే రెండో ఘాట్ రోడ్ లో మరో ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే టెంపో వాహనం అదుపు తప్పి కొండను ఢీకొట్టింది. సైడ్ సేఫ్టీ వాల్ లేకపోవడంతో వాహనం నేరుగా కొండను ఢీకొట్టి ఆగిపోయింది.

అతివేగంతోనే ప్రమాదం..

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్ లో ముందు వెళ్తున్న బస్సుని ఓవర్ టేక్ చేయబోయిన టెంపో వాహనం కొండను ఢీకొట్టి ఆగిపోయింది. 10వ కిలోమీటర్ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సుని ఓవర్ టేక్ చేయడానికి టెంపో అతివేగంతో ముందుకు వెళ్లడం వల్లే కొండను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడం సంతోషించదగ్గ విషయం. ప్రమాద సమయంలో టెంపో వాహనంలో యాత్రికులెవరూ లేరు.

ఇటీవల ఘాట్ రోడ్ ప్రమాదాలపై సమీక్ష నిర్వహించారు ఈవో ధర్మారెడ్డి. అతివేగం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, వేగ నియంత్రణకోసం చర్యలు చేపట్టాలని సూచించారు. కొండపైకి వెళ్లే వాహనాలు, కిందకు వచ్చే వాహనాల గరిష్ట వేగ నియంత్రణకోసం చర్యలు చేపట్టారు. ప్రయాణానికి కనీస సమయం కచ్చితంగా పాటించాలని చెప్పారు. ఆ సమీక్ష జరిగిన వారంలోపే మరో ప్రమాదం ఆందోళన కలిగిస్తోంది. వరుస ప్రమాదాలపై టీటీడీ సీరియస్ గా దృష్టిసారించింది.

First Published:  9 Jun 2023 3:26 AM GMT
Next Story