Telugu Global
Andhra Pradesh

తిరుమల డ్రోన్ వీడియో కలకలం.. అసలా..? నకిలీనా..??

తిరుమల ఆలయం ముందు నుంచి డ్రోన్ కెమెరా పైకి వెళ్లి ఆలయం వెనక భాగం వరకు ప్రయాణించి చిత్రీకరించిన వీడియో ఒకటి ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్, ఫేస్ బుక్ లో చక్కర్లు కొడుతోంది. గతంలో ఎవరూ అలాంటి వీడియో చూసి ఉండరు.

తిరుమల డ్రోన్ వీడియో కలకలం.. అసలా..? నకిలీనా..??
X

తిరుమల శ్రీవారి ఆలయం, తిరుమల కొండలను కూడా నో ఫ్లయింగ్ జోన్ గా పరిగణిస్తారు. ఆలయం పైనుంచి విమానాలు ఎగరడానికి వీల్లేదు. అతెందుకు.. తిరుమలకు రోప్ వే ఇప్పటి వరకూ వేయకుండా ఉండటానికి కూడా కారణం అదే. అతి పవిత్రమైన తిరుమల కొండపై డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ కూడా నిషిద్ధమే. కానీ ఆ పాపం జరిగిందని ఇప్పుడు ప్రచారం మొదలైంది. నిఘా విభాగం కళ్లుగప్పి ఎవరో డ్రోన్ కెమెరా ఎగరేశారని అంటున్నారు. తిరుమల డ్రోన్ దృశ్యాల పేరుతో కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తిరుమల ఆలయం ముందు నుంచి డ్రోన్ కెమెరా పైకి వెళ్లి ఆలయం వెనక భాగం వరకు ప్రయాణించి చిత్రీకరించిన వీడియో ఒకటి ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్, ఫేస్ బుక్ లో చక్కర్లు కొడుతోంది. గతంలో ఎవరూ అలాంటి వీడియో చూసి ఉండరు. ఆ ఫ్లై కెమెరా విజువల్స్ ఇప్పుడు వాట్సప్ లో కూడా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో టీటీడీ నిఘా విభాగంపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఫేక్ వీడియో అంటూ సర్దిచెబుతున్నారా..?

ఈ వీడియోలు వైరల్ కావడంతో టీటీడీ సర్దిచెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ వీడియోలను ఫోరెన్సిక్ విభాగానికి పంపిస్తున్నామని, అవి అసలా, నకిలీయా అని తేల్చేస్తామంటున్నారు సీవీఎస్వో నరసింహ కిషోర్. సైబర్ క్రైమ్ విభాగం వారు ఈ దర్యాప్తు ప్రారంభించారని చెప్పారాయన. గతేడాది నవంబర్‌ లోనే ఈ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసినట్లు గుర్తించామంటున్నారు అధికారులు. పూర్తిస్థాయిలో విచారణ జరిగిన తర్వాతే నిజానిజాలు తెలుస్తాయంటున్నారు. సామాజిక మాధ్యమాలనుంచి ఆ వీడియోను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు.

First Published:  20 Jan 2023 9:48 PM IST
Next Story