Telugu Global
Andhra Pradesh

త్రీడీ కాదు, ఫేక్ కాదు.. తిరుమల డ్రోన్ వెనక అసలు కారణం ఇదే..

Tirumala Drone Camera video: తిరుమలలోని కాకులకోన వద్ద సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌ వీడియోలు తీసేందుకే డ్రోన్‌ ఆపరేటర్‌ అక్కడకు వచ్చినట్టు గుర్తించారు. మూడు నెలల క్రితం సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌ వీడియోలను డ్రోన్లతో చిత్రీకరించేందుకు టీటీడీ ఓ సంస్థకు అనుమతి ఇచ్చింది.

త్రీడీ కాదు, ఫేక్ కాదు.. తిరుమల డ్రోన్ వెనక అసలు కారణం ఇదే..
X

తిరుమల డ్రోన్ వీడియో గుట్టు వీడింది. అది ఫేక్ కాదు, త్రీడీ టెక్నాలజీతో సృష్టించిన వీడియో కాదు, మార్ఫింగ్ కాదు, నకిలీ కాదు అని తేలిపోయింది. సాక్షాత్తూ టీటీడీ అధికారులే అనుమతి ఇచ్చి తీయించిన డ్రోన్ వీడియో అని రుజువైంది. ఈ విషయాన్ని అధికారులు చెప్పకపోయినా వైసీపీ అధికారిక మీడియాలో వచ్చింది కాబట్టి నమ్మి తీరాల్సిందే. మరి ఇంత చేసి, టీటీడీయే అనుమతి ఇచ్చి.. ఆ విషయం మరచిపోయి ఎవరో ఏదో చేసేశారు, అపచారం జరిగింది, అన్యాయం జరిగింది, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని మాట్లాడటం మాత్రం ఇక్కడ హైలెట్ గా మారింది.

అనుమతి ఎందుకిచ్చారంటే..?

తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్‌ కెమెరా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. శ్రీవారి ఆస్థాన మండపం సమీపంలోని రోడ్డుపై నుంచి డ్రోన్లు ఎగురవేశారు. డ్రోన్లు ఎగురవేస్తున్న సమయంలో​ కొందరు భక్తులు ఆ దృశ్యాలను చిత్రీకరించారు. ఆ డ్రోన్లతోనే శ్రీవారి ఆలయ దృశ్యాల చిత్రీకరణ జరిగింది. అయితే ఈ డ్రోన్లు తిరుమల కొండకి చేరుకోడానికి, అక్కడ చిత్రీకరణకు కూడా టీటీడీయే అనుమతి ఇవ్వడం విశేషం. పాత అన్నదాన సత్రాన్ని పునరుద్ధరించే విషయంలో అక్కడికి గ్యాస్ పైప్ లైన్ తీసుకెళ్లేందుకు డ్రోన్ తో సర్వే చేపట్టారని, ఆ డ్రోన్ ఎగిరినప్పుడే ఈ వీడియోలు కూడా తీసి ఉంటారని మరో కథనం కూడా ప్రచారంలోకి వచ్చింది.

తిరుమలలోని కాకులకోన వద్ద సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌ వీడియోలు తీసేందుకే డ్రోన్‌ ఆపరేటర్‌ అక్కడకు వచ్చినట్టు గుర్తించారు. మూడు నెలల క్రితం సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌ వీడియోలను డ్రోన్లతో చిత్రీకరించేందుకు టీటీడీ ఓ సంస్థకు అనుమతి ఇచ్చింది. ఆ సమయంలో కాకులకోన వద్ద వీడియోలతోపాటు పనిలో పనిగా శ్రీవారి ఆలయ డ్రోన్‌ దృశ్యాలను కూడా ఆపరేటర్‌ చిత్రీకరించారు. అలా రికార్డ్ అయిన దృశ్యాలు బయటకు వెళ్లాయి. దీంతో ఈ వ్యవవహారం హాట్ టాపిక్ గా మారింది.

సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ని వీడియో తీయడానికి అనుమతి ఇచ్చిన అధికారులు, ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు ఎందుకు చేరవేయలనేదే ఇప్పుడు ప్రశ్నార్థకం. ఒకవేళ నిజంగానే ఆ విషయం ఉన్నతాధికారులకు తెలిసి ఉంటే, టీటీడీ ఈవో, చైర్మన్, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఆ విషయం గురించి ముందే చెప్పేవారు. అది ఫేక్ వీడియో అని, ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపిస్తున్నామని చెప్పేవారు కాదు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ వీడియో తీయడానికి డ్రోన్ కెమెరా తెచ్చినప్పుడు అధికారులు వెంట ఉండి, సంబంధిత దృశ్యాలను మాత్రమే చిత్రీకరించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే వారు లైట్ తీసుకున్నారు. డ్రోన్ ఆపరేటర్ కొండ మొత్తం ఓ రౌండ్ వేశారు. ఇంకేముంది తిరుమల ఆలయం మొత్తం ఆ వీడియోలో రికార్ట్ అయింది. ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ లబోదిబోమంటే ఉపయోగం ఏముంది..? దీంతో ఇప్పుడు వివరణలు, నష్టనివారణ చర్యలు అంటూ టీటీడీ ఇబ్బంది పడుతోంది.

First Published:  21 Jan 2023 2:00 PM GMT
Next Story