Telugu Global
Andhra Pradesh

శ్రీవారి భక్తులకు అలర్ట్.. జనవరి 2నుంచి ఆ నిబంధన పాటించాల్సిందే

జనవరి 1వ తేదీన తిరుపతిలో కౌంటర్లు ఏర్పాటు చేయబోతున్నారు. 10రోజుల కోటా పూర్తయ్యే వరకు టికెట్లు ఇస్తూనే ఉంటారు. కోటా పూర్తయిన వెంటనే టికెట్ల జారీ నిలిపి వేస్తారు.

శ్రీవారి భక్తులకు అలర్ట్.. జనవరి 2నుంచి ఆ నిబంధన పాటించాల్సిందే
X

తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు జనవరి 2వతేదీ నుంచి 11వతేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ దర్శనం కోసం కేవలం టోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే కొండపైకి రావాలని సూచించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ధర్మారెడ్డి సెలవుపై ఉండటంతో తాత్కాలిక ఈఓగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్.. సర్వదర్శనం క్యూలైన్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైకుంఠ ఏకాదశి దర్శనాలపై కీలక సూచనలు చేశారు.

సర్వదర్శనానికి జనవరి 1నుంచి టోకెన్లు..

జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతి ఉంది. దీనికోసం ఇప్పటికే ఆన్ లైన్లో ప్రత్యేక దర్శన టికెట్లు కేటాయించారు. రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు 2లక్షలు అమ్ముడయ్యాయి. ఇక వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం విషయానికొస్తే.. జనవరి 1వ తేదీన తిరుపతిలో కౌంటర్లు ఏర్పాటు చేయబోతున్నారు. 10రోజుల కోటా పూర్తయ్యే వరకు టికెట్లు ఇస్తూనే ఉంటారు. కోటా పూర్తయిన వెంటనే టికెట్ల జారీ నిలిపి వేస్తారు. ఆ తర్వాత ఇక సర్వదర్శనానికి అనుమతి లేనట్లే. అంటే తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు పొందినవారు మాత్రమే జనవరి 2నుంచి 11వతేదీ మధ్యలో వైకుంఠ ద్వారం దర్శనానికి రావాల్సి ఉంటుంది.

అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న విష్ణునివాసం, రైల్వేస్టేషన్‌ వెనుక ఉన్న సత్రాలు, ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్‌, ఇందిరా గ్రౌండ్, జీవకోన జడ్పీ హైస్కూల్‌, బైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్‌ హైస్కూల్‌, ఎంఆర్‌ పల్లి జడ్పీ హైస్కూల్‌, రామచంద్ర పుష్కరిణి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. ఇక్కడ సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు దర్శనం స్లాట్ ఉన్న రోజు తిరుమలలోని కృష్ణతేజ గెస్ట్ హౌస్ వద్ద రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో అనవసర రద్దీని నివారించేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముందుగానే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను కేటాయిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక దర్శనాల కోటా పూర్తయింది. సర్వ దర్శనాలకు సంబంధించి జనవరి 1న టోకెన్ల జారీ మొదలవుతుంది. ఆ టోకెన్లు ఉన్నవారే దర్శనానికు రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

First Published:  27 Dec 2022 12:13 PM IST
Next Story