జగనన్న కాలనీలు డౌటే..!
కూటమి ప్రభుత్వం టిడ్కో అపార్ట్ మెంట్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యతనిస్తోంది. అంటే టిడ్కో ఇళ్లకు మోక్షం, జగనన్న కాలనీలపై నిర్లక్ష్యం అనే అనుమానాలు మొదలవుతున్నాయి.
ఏపీలో జగనన్న కాలనీల పరిస్థితి ఏంటి..? నిర్మాణాలు పూర్తయిన చోట లబ్ధిదారులు హ్యాపీ, మరి సగంలో ఉన్న నిర్మాణాలు, అసలు మొదలే కాని వాటి సంగతేంటి..? కొత్త ప్రభుత్వం వాటిని పట్టించుకుంటుందా..? ఇప్పటి వరకు జగనన్న కాలనీలపై అధికారికంగా ఎవరూ స్పందించలేదు, కనీసం ఆ పథకం పేరు మారుస్తున్నామని కూడా చెప్పలేదు. అయితే టిడ్కో ఇళ్ల కేటాయింపులు స్పీడందుకోబోతున్నాయనే వార్తలు బయటకొస్తున్నాయి. అంటే టిడ్కో ఇళ్లకు మోక్షం, జగనన్న కాలనీలపై నిర్లక్ష్యం అనేది ఖాయంగా తేలిపోయింది.
2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల పేరిట హడావిడి చేసింది. సరిగ్గా ఎన్నికల సమయంలో ఇంకా పూర్తికాని ఇళ్లలో కూడా గృహప్రవేశాలు చేసి సందడి చేశారు నేతలు. ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగింది. టిడ్కో ఇళ్ల వ్యవహారంలో కూడా తేడా వచ్చింది. పూర్తి ఉచితంగా ఇళ్లను కేటాయిస్తామన్న జగన్.. వివిధ కారణాలతో టిడ్కో ఇళ్ల కేటాయింపుని పక్కనపెట్టారు. అపార్ట్ మెంట్ల రంగులు మారిపోయాయి, కొన్నాళ్లు కరోనా రోగుల ఆలనా పాలనకు అవి ఆవాసాలుగా మారాయి. ఆ తర్వాత ఇళ్ల కేటాయింపులు జరిగినా అవి కూడా అరకొరేననే ఆరోపణలున్నాయి. అయితే టిడ్కో ఇళ్లు పక్కనపెట్టిన జగన్, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, వాటిలో నిర్మాణాలు మొదలు పెట్టారు. జగనన్న కాలనీల పేరుతో పెద్ద ఎత్తున ప్లాట్లు వేసి, నిర్మాణాలు చేపట్టారు. కొన్నిచోట్ల మాత్రమే నిర్మాణాలు పూర్తయి గృహప్రవేశాలు జరిగాయి. చాలా చోట్ల నిర్మాణాలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి, ఇంకొన్ని చోట్ల అసలు పునాదులే పడలేదు. ఈ దశలో మళ్లీ ప్రభుత్వం మారింది, ప్రభుత్వం ప్రయారిటీ కూడా మారింది. జగనన్న కాలనీలను పక్కనపెట్టి, కూటమి ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై ఫోకస్ పెడుతోంది.
గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని జగన్ పట్టించుకోలేదని, జగన్ పై నమ్మకం లేక హడ్కో రుణాలు కూడా రాలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు హడ్కో రుణమంజూరుకి సానుకూలత వ్యక్తం చేసిందని చెబుతున్నారు. రూ.2వేల కోట్ల అప్పు ఇచ్చేందుకు హడ్కో ముందుకొచ్చిందని, దీంతో టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందనేది టీడీపీ అనుకూల మీడియా కథనం. రాష్ట్రవ్యాప్తంగా 1.17 లక్షల టిడ్కో ఇళ్లు నిర్మించాల్సి ఉందని, రుణాలు మంజూరై, ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వీటి నిర్మాణం మొదలవుతుందని అంటున్నారు అధికారులు.
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తే ఆ క్రెడిట్ గత ప్రభుత్వానికి వెళ్తుందనేది కూటమి నేతల ఆలోచన. అందుకే కాలనీల వ్యవహారాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టారనుకోవాలి. అదే సమయంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలనుకుంటున్నారు. మొత్తమ్మీద ప్రభుత్వాలు మారడంతో ఇళ్ల నిర్మాణంలో వారి ప్రయారిటీలు కూడా మారిపోతున్నాయి. అంతిమంగా ప్రజలు వారి మధ్య నలిగిపోవాల్సి వస్తోంది.