జనసేనలో రెండో టికెట్.. పార్టీ మారుతున్న వైసీపీ నేత..
పవన్ నుంచి సానుకూల సంకేతాలు వెలువడ్డాయని, వైసీపీ నేత జనసేనలో చేరడం లాంఛనమేనని అంటున్నారు. అదే జరిగితే 2019లో పోటీ చేసిన అభ్యర్థులే 2024లో కూడా బరిలో దిగుతారు. కానీ పార్టీలు మాత్రం మారిపోతాయి అంతే తేడా.
తెనాలి నుంచి జనసేన తరపున బరిలో దిగుతానంటూ తొలి టికెట్ కన్ఫామ్ చేసుకున్నారు నాదెండ్ల మనోహర్. ఇప్పుడు జనసేన తరపున రెండో టికెట్ కూడా కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది. రాజోలు నియోజకవర్గం నుంచి బొంతు రాజేశ్వరరావుకి జనసేన టికెట్ ఇచ్చేందుకు ఇప్పటికే చర్చలు పూర్తయినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న బొంతు.. టికెట్ హామీతో జనసేనలోకి వచ్చేస్తారని అంటున్నారు.
ఎస్సీ రిజర్డ్వ్ నియోజకవర్గమైన రాజోలు రెండు దఫాలుగా వైసీపీకి దొరకలేదు. 2014లో టీడీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు, 2019లో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ ఇక్కడ గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఈ రెండుసార్లు వైసీపీ తరపున బరిలో నిలిచిన బొంతు రాజేశ్వరరావు స్వల్ప తేడాలతో ఓడిపోయారు. 2014లో 4 శాతం ఓట్లతో ఓడిపోయారు. 2019లో జరిగిన త్రిముఖ పోరులో కేవలం 814 ఓట్లతో జనసేన అభ్యర్థి చేతిలో ఓడిపోయారు రాజేశ్వరరావు. జనసేన ఎమ్మెల్యే రాపాక వైసీపీ సానుభూతిపరుడిగా మారడంతో నియోజకవర్గంలో అంతర్గత పోరు మొదలైంది. రాజేశ్వరరావు వర్గం పెత్తనం తగ్గిపోయింది. కొన్నాళ్లు రాపాక, రాజేశ్వరరావు మధ్య పోరు నడిచినా, చివరకు రాపాకకే వచ్చే దఫా వైసీపీ టికెట్ అని తేలిపోయింది. దీంతో బొంతు రాజేశ్వరరావు పార్టీకి గుడ్ బై చెప్పేయడానికి సిద్ధమయ్యారు.
పార్టీలు తారుమారు..
జనసేన పార్టీ చరిత్రలో మొదటి విజయం అందించిన నియోజకవర్గం రాజోలు కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో పొత్తుల పాట్లు ఉన్నా కూడా ఆ సీటుని పట్టుబట్టి జనసేనే తీసుకునే అవకాశముంది. అందుకే పొత్తులతో ఇబ్బంది లేదని నిర్థారించుకున్న తర్వాతే బొంతు రాజేశ్వరరావు, పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. టికెట్ హామీ తీసుకున్నాక ఆయన అధికారికంగా జనసేనలో చేరేందుకు ముహూర్తం నిర్ణయంచుకుంటారని తెలుస్తోంది. పవన్ నుంచి సానుకూల సంకేతాలు వెలువడ్డాయని, వైసీపీ నేత జనసేనలో చేరడం లాంఛనమేనని అంటున్నారు. అదే జరిగితే 2019లో పోటీ చేసిన అభ్యర్థులే 2024లో కూడా బరిలో దిగుతారు. కానీ పార్టీలు మాత్రం మారిపోతాయి అంతే తేడా.