కడప ఉక్కుకి ముచ్చటగా మూడో సీఎం శంకుస్థాపన
కడప ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసి నేటికీ మూడేళ్లు పూర్తికావడంతో స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ పూర్తి చేశారు సీఎం గారూ అని వ్యంగ్యంగా సోషల్‌మీడియా వేదికగా ప్రతిపక్ష టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ఏదో ఒక అడ్డు వస్తూనే ఉంది. ఉక్కు కర్మాగారం నిర్మాణానికి ముచ్చటగా ముగ్గురు సీఎంలు శంకుస్థాపన చేశారు. ఏ సీఎం హయాంలోనూ కర్మాగారం ప్రతిపాదన రూపుదాల్చలేదు. 2007 జూన్ 10న జమ్మలమడుగు మండలం అంబవరం వద్ద 10,670 ఎకరాల్లో బ్రహ్మణి స్టీలు ఫ్యాక్టరీకి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. పనులు జోరందుకుంటాయనుకున్న దశలో హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం తలపెట్టిన యజమాని గాలి జనార్ధనరెడ్డిని మైనింగ్ కేసుల్లో ఇరుక్కోవడంతో ఫ్యాక్టరీ శంకుస్థాపనకే పరిమితమైంది.
చంద్రబాబు వంతు వచ్చింది. సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తుందని ప్రకటించి, 2018 డిసెంబరు 27న జమ్మలమడుగు మండలం కంబాలదిన్నె వద్ద శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన జరిగిన మూడు నెలలకే ఎన్నికలు రావడం టీడీపీ దారుణ పరాజయంతో ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేకుండా పోయింది.
కడప జిల్లా వాసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 2019 డిసెంబరు 23న మరోసారి ఉక్కు కర్మాగారం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం మూడేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు. కడప ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసి నేటికీ మూడేళ్లు పూర్తికావడంతో స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ పూర్తి చేశారు సీఎం గారూ అని వ్యంగ్యంగా సోషల్‌మీడియా వేదికగా ప్రతిపక్ష టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.