విశాఖ బీచ్ రోడ్డులో కారు బీభత్సం.. ముగ్గురు మృతి
ప్రమాదానికి గురైన కారులో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నారు. వీరిలో వెనుక సీటులో కూర్చున్న ఎం.మణికుమార్ (25) తీవ్ర గాయాలతో కారులోనే ప్రాణాలు కోల్పోయాడు.
యువకుల మద్యం మత్తు, అతి వేగం ముగ్గురి ప్రాణాలు తీసింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ద్వారకా జోన్ ఏసీపీ మూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సాగర్ నగర్ నుంచి ఎండాడ వైపు వెళ్తున్న కారు రాడీసన్ హోటల్ మలుపు వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి రహదారి మధ్యలోని డివైడర్‌ను ఢీకొట్టింది. అదే వేగంతో చెట్టును ఢీకొట్టి అవతలి వైపునకు దూసుకుపోయింది. కారు వేగానికి చెట్టు విరిగిపోయిందంటే అది ఎంత వేగంలో వస్తోందో అర్థం చేసుకోవచ్చు. అదే క్రమంలో ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న దంపతులు పృథ్వీరాజ్(28), ప్రియాంక (21) సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వీరిది ఒడిశాలోని రాయగడ.
ప్రమాదానికి గురైన కారులో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నారు. వీరిలో వెనుక సీటులో కూర్చున్న ఎం.మణికుమార్ (25) తీవ్ర గాయాలతో కారులోనే ప్రాణాలు కోల్పోయాడు. మణికుమార్‌ది పీఎం పాలెంలోని ఆర్‌హెచ్ కాలనీ. డిప్లొమా చేశాడు. అతని తండ్రి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తుంటాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారులోని ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. మరో ఇద్దరు ఈ ఘటనలో గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన పృథ్వీరాజ్ ఓ సంస్థలో సైట్ ఇంజినీరుగా పనిచేస్తున్నట్టు సమాచారం.
ప్రమాదం జరగడానికి కొద్ది సమయం ముందు కారులోని వ్యక్తులు సాగర్‌నగర్ ఆర్చి వద్ద యువకులతో వాగ్వివాదానికి దిగారు. రోడ్డుపై మద్యం సీసాలు పగలగొట్టి హల్‌చల్ చేశారు. యువకుల వద్ద ఉన్న సెల్‌ఫోన్ ను లాక్కుని వెళ్లిపోయారు. ప్రమాదానికి గురైన కారులో ఖాళీ మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించారు.